దేశమును ప్రేమించుమన్నా

I love my country
I love my country INDIA,that is BHARAT

The land of.. Himalayas and Vindhyas

The land of.. Ganga and Yamuna; Narmada and Brahmaputra

The land of.. Godavari and Kaveri; Mahanadhi and Krishna

The land of.. Vedas and Upanishads

The land of.. Maharshi Vaalmiki and Veedavyaasa

The land of.. Ramayana and Mahabharatha

The land of.. Sri Rama and Sri Krishna

The land of.. Adi Sankaraachaarya and Gurunanak

The land of.. Bhagavad Geeta and Budh Gaya

The land of.. Jantar Mantar and Tajmahal

The land of.. Ashoka and Shivaji; Rana Pratap and Sri Harsha

The land of.. Ramakrishna Paramahamsa and Vivekaananda

The land of.. Rabindranaath Tagore and C.V.Raman

The land of.. Varanasi and Rameswaram

The land of.. Seeta and Savitri

The land of.. Jhansi Laxmi Bai and Meera Bai

The land of.. Mahatma Gandhi and Bala Gangadhar Tilak

The land of.. Somnath and Saranath; Salivahana Saka and Sravana Belagola

The land of.. Tirupathi and Haridwar

The land of.. Kashmir and Kanyakumari

The land of.. Tansen and Thyagaraja

The land of.. Bharata Natyam and Kuchipudi

The land of.. Kathak and Kathaakali

The land of.. Netaji Sbhashchandra Bose and Javaharlal Nehru

The land of.. Tulasidas and Suradas

The land of.. kabeerdas and Bhadrachala Ramadas

The land of.. Jayadeva and Annamacharya

The land of.. Swathi tirunal and Narayana Tirtha

The land of.. Purandara dasa and Syaamasastri

The land of.. Raja Raja Narendra and Srikrishnadevaraya

The land of.. Srinadha Kavi Sarvabhowma and Bhakta Kavi Potana

The land of.. Kalidasa and Vikramaditya

The land of.. Viswanatha Satyanarayana and Adibhatla Narayana dasu

The land of.. Sreerangam Sreenivasarao and Raachakonda Viswanaadha Sastri

The land of.. M S Subbulaxmi and Mangalampalli Baalamurali Krishna

And a Galaxy of such celebrities

Salutations to one and all, Sab ko Pranam

ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు


వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాఢు-నరసింహ)

National Integration Camp,
Srikakulam,a.p.,21.04.2008 to 27.04.2008

ఆంధ్ర భాష చరిత్ర, సంస్కృతుల సర్వతోముఖ అభివృద్ధికి సూచనలు

శ్రీ సరస్వత్యై నమః


తమిళభాషలో తొలికావ్యం 'తిరుక్కురళ్'ను రచించిన మొదటి తమిళకవి తిరువళ్ళువార్ జ్ఞాపకార్థము కన్యాకుమారి సమీపమున సముద్ర మధ్యమున వున్న 'వివేకానందరాక్'పై 130 అడుగుల ఎత్తుగల శిలావిగ్రహమును ప్రతిష్ఠించి, ప్రక్కనే ఒక హాలు నిర్మించి ఆ గోడలపై 'తిరుక్కురళ్' గ్రంధములోని విశేషములను తమిళ భాషలో చెక్కించి,-- ఈ నిర్మాణమునకు ఏడుకోట్ల రూపాయలు వ్యయపరచి-- తమ మాతృభాషాభిమానమును ప్రపంచమునకు చాటిచెప్పిన తమిళ సోదరులు ఎంతయు అభినందనీయులు.

ఇక ఫ్రకృతము:

1)ఆంధ్రభాషలో ఆదికావ్యము రచించిన ఆదికవి నన్నయ భట్టారకునకు, ఆ రచనకు మూలకారణమైన చాళుక్య ప్రభువు రాజరాజనరేంద్రునకు, రాజమహేంద్రవరంలో 65 అడుగుల ఎత్తుగల రెండు శిలావిగ్రహములను ప్రతిష్ఠించి, ప్రక్కనే అధునాతన సౌకర్యములతో 'రాజరాజ మందిరము' అను పేరున ఒక ఆడిటోరియంను నిర్మించుట మన ప్రథమ కర్తవ్యము.

2)నేడు కర్ణాటక రాష్ట్రములో వున్న 'హంపీ విజయనగర' శిధిలాల స్థలములో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయల సంస్మరణార్ధము 65 అడుగుల విగ్రహమును ప్రతిష్ఠించి,ప్రక్కనే 'భువనవిజయము' పేరుతో ఒక సభాప్రాంగణము నిర్మించి-- అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన్న, ధూర్జటి, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణకవి, అయ్యలరాజు రామభద్రుడు, మాదయ్యగారి మల్లన ల నిలువెత్తు విగ్రహములు నిర్మింపజేయుట అత్యావశ్యకము.

3)1022లో రాజమహేంద్రవరములో రాజరాజ నరేంద్రునకు జరిగిన పట్టాభిషేకదినమును "వేంగీ" ఉత్సవముగను,1509లో హంపీ విజయనగరమున శ్రీకృష్ణదేవరాయలకు జరిగిన పట్టాభిషేకదినమును "హంపీ"ఉత్సవముగను మూడు రోజులపాటు జరిపించి ప్రాచీనాంధ్రవైభవమును గూర్చి బహుళవ్యాప్తి కలిగించుట ఆంధ్రులమైన మన అందరి కర్తవ్యము.

4)నేడు తమిళనాడులో వున్న తంజావూరు 'సరస్వతీమహల్' పుస్తక భాండాగారము తంజావూరును పాలించిన తెలుగు నాయకరాజుల, ఆంధ్రభాషాభిమానులైన మహారాష్ట్ర ప్రభువుల కృషి ఫలితము. కనుక ఆ గ్రంధాలయములోనున్న వివిధ భాషలలోని గ్రంధములు అన్నంటిని మైక్రోఫిల్ముల ద్వారా, ఆడియో వీడియో కేసెట్లద్వారా, కంప్యూటరు డిస్కులద్వారా సేకరించి మన రాష్ట్రమునకు తెచ్చుకొనుట అత్యంతావశ్యకము.

5)దక్షిణభారతదేశంలో భాషా,సంస్కృతుల అధ్యయన సంస్థలు కేంద్ర ప్రభుత్వంచే స్థాపించబడినవి,(1)నాగపూరు (2)తంజావూరులలో వుండగా రాష్ట్రప్రభుత్వం వారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఒక సంస్థను ఏర్పాటు చేసారు.వీటికి ఏఏ నిధులు ఎంతెంత వస్తున్నవో, ఏ విధంగా ఉపయోగపడుచున్నవో పరిశీలన జరిపి ఆయా కార్యక్రమములు విస్తృత పరచుట ఆవశ్యకము.

6)కేంద్ర ప్రభుత్వ అధీనంలో దేశభాషా సంస్కృతుల పరిరక్షణకు ఉన్న సంస్థలు:

౧) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ
౨) కేంద్రసాహిత్య ఎకాడమీ, కేంద్ర సంగీత ఎకాడమీ, కేంద్ర నాటక ఎకాడమీ, కేంద్ర నాట్యకళా ఎకాడమీ.
౩)రాజీవ్ గాంధీ ఫౌండేషన్
౪)కల్చరల్ బెనిఫిట్ ఫండు.

ఈ సంస్థల నుండి ఏఏ నిధులు మన రాష్ట్రమునకు వచ్చు అవకాశమున్నదో పరిశీలించి తెచ్చుకొను ప్రయత్నము చేయవలయును.

7)న్యూఢిల్లీలో ఇందిరా ప్రియదర్శిని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యూజిక్, డాన్స్ సంస్థ వున్నది. దీని ప్రధాన కేంద్రము న్యూయార్క్ నగరంలో ఉన్నది.ఈ సంస్థలో అంతర్జాతీయ స్థాయికి చెందిన నర్తకీమణులు సోనాల్ మాన్సింగ్, మృణాళినీ సారాభాయి, యామినీకృష్ణమూర్తి వంటివారు డైరెక్టర్లుగా పనిచేసి భారతీయ సంగీతముపై భారతీయ నాట్యశాస్త్రముపై పరిశోధనలు జరిపి ఎన్నో గ్రంధములు రచించేరు.ఈ సంస్థకు ప్రపంచ దేశాలన్నిటి నుండి ధనసహాయము అందుచున్నది.మన రాష్ట్రములోని ప్రసిద్ధ కళాకారులకు ఈ సంస్థతో సంబంధము లేర్పరుచుట ఆవశ్యకము.

8)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వము వారిచే మూడు సంస్థలు నడుపబడుచున్నవి.
౧)రాష్ట్ర సాంస్కృతిక శాఖ (౨)రాష్ట్ర సాంస్కృతిక మండలి (౩)పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. 1985లో ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు(1)ఆంధ్ర సాహిత్య పరిషత్ (2) ఆంధ్ర సంగీత పరిషత్ (3)ఆంధ్ర నాటక పరిషత్ (4) ఆంధ్ర నాట్యకళా పరిషత్ లను నాల్గింటిని రద్దుచేసి ఒకే సంస్థ ఆధిపత్యములో సమగ్రాభివృద్ధి సాధించుటకు తెలుగు విశ్వ విద్యాలయమును, లలిత కళా తోరణ ప్రాంగణమును ఏర్పాటు చేసినారు.ఈ లలిత కళల సర్వతోముఖాభివృద్ధికి సమన్వయ కమిటీలను ఏర్పరచుకుని, అవసరమైతే పై పరిషత్తులను పునర్నిర్మించుట ఆవశ్యకము.

9)ఆంధ్రప్రదేశలో ప్రస్తుతము పన్నెండు ప్రభుత్వ సంగీత కళాశాలలున్నవి.ఆ సంస్థలకు తగిన వనరులు ఎన్ని వున్నవో గమనించి విద్యార్థుల విద్యాప్రమాణములు పెంచుటకు తగిన చర్యలు తీసుకోవలసి యున్నది.రాష్ట్రములోని మిగిలిన జిల్లాలలో కూడా ఇట్టి సంగీత కళాశాలలు ఏర్పాటుచేసి ఆంధ్రులలో శాస్త్రీయ సంగీతమునకు బహుళ వ్యాప్తిని కలిగించి ఆంధ్రుల సాంస్కృతిక వైభవమునకు చేయూత నియ్యవలెను."త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు" తెలుగుపాటకు ప్రపంచ ఖ్యాతిని సమకూర్చిపెట్టినవి గనుక "మా తెలుగు తల్లికీ మల్లెపూదండ" అందించుట మనందరి బాధ్యత మరియు తక్షణ కర్తవ్యము.

10)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు తెలుగుకు ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి తెలుగుభాషాచరిత్ర, సంస్కృతుల సర్వతోముఖ, సత్వర అభివృద్ధికోరకు ఒక ప్రత్యేక మంత్రివర్యుని నియమించుట, అత్యంత ఆవశ్యకము.ఈ తెలుగు శాఖకు తగు సూచనలను, సలహాలను అందజేయుటకు వివిధ రంగాలలో విశిషకృషి సల్పిన ముప్పయిమంది సలహా సంఘ సభ్యులతో కూడిన "తెలుగుభాషాసమితి"అను పేరుతే ఒక బలీయమైన సంఘమును రూపొందించుటయు ఆవశ్యకము. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పట్టణము, మరియు ప్రతి గ్రామమునందును 'తెలుగుభాషాసమితి' సంఘములను ఏర్పరచి తెలుగుభాష ఔన్నత్యానికి బహుళ వ్యాప్తిని కలిగించుట ఎంతైనా ఆవశ్యకము.

11)మన ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయభాష, పరిపాలనాభాష, వ్యవహారికభాషగా యున్న తెలుగుభాషను ఒక ప్రామాణిక భాషగా అభివృద్ధిని చేకూర్చి ప్రాచీన కాలమునాటి రాజరాజ నరేంద్రుని, కాకతీయ రాజులు, శ్రీకృష్ణదేవరాయల పాలనలోవలే ఉన్నత స్థితిని కలిగించుట మనందరి తక్షణ కర్తవ్యము.

12)మన మాతృభాష ఎంతో అందమైన భాష.తెలుగు అక్షరములు గుండ్రముగా వుండుటచేత, అచ్చులో చూచినా, వ్రాసినా అందముగా కనబడును.తెలుగు అక్షరములు అజంతములగుటచేత వినుటకు సొంపుగా వుండును. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా కన్నతల్లి వంటి మన తెలుగును అభిమానించి,ఆదరించి మన మాతృభాషాభివృద్ధికి ఆంధ్రులెల్లరూ తోడ్పడుదురుగాక!
మనమందరం తెలుగులోనే ఆలోచిద్దాం.తెలుగులోనే మాట్లాడుకుందాం.

శ్రీకాకుళం సదా తెలుగుతల్లి సేవలో
11-11-2008 ---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

తెలుగు - వెలుగు

తెలుగు - వెలుగు

తేట తేట తెలుగు
తియ్యనైన తెలుగు
తేనెలొలుకు పలుకు
తెలుగు వెలుగు జిలుగు
తెలుగు పలుకు వెలుగు.

త్రిలింగ దేశం మనదేనోయ్
తెలుంగులంటే మనమేనోయ్
రాయలు మనవాడేనోయ్
పండిత రాయలు మనవాడోయ్
కలం తిక్కన ఖడ్గ తిక్కన
అంతా మనవారోయ్.

నన్నయ మనవాడోయ్
బమ్మెర పోతన మనవాడోయ్
పెద్దన,తిమ్మన,సూరన
అంతా మనవారోయ్
త్యాగయ మనవాడోయ్
క్షేత్రయ్య మనవాడోయ్
అన్నమయ్య, రామదాసు
అంతా మనవారోయ్.

కందుకూరి మనవాడోయ్
టంగుటూరి మనవాడోయ్
ఆంధ్రతేజము నందమూరి
అంతా మనవారోయ్.

కాకతి రుద్రమ్మ
బొబ్బిలి మల్లమ్మ
కవయిత్రులు మొల్ల,తిమ్మక్క
రంగాజమ్మ మనవారోయ్.

తెలుగును ప్రేమించుమన్నా
తెలుగు భాషను పెంచుమన్నా
తెలుగు అంటే మాట కాదోయ్
తెలుగు అంటే మనుషులోయ్
భాషాభిమానం నాకు కద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
పూని యేదైనాను ఒక మేల్
కూర్చి జనులకు చెప్పవోయ్.

స్వంత లాభం కొంత మానుకు
భాషకోసం పాటుపడవోయ్
ప్రాచీన భాషకోసం పాటుపడవోయ్
మాతృభాష కోసం పాటుపడవోయ్.

చేయెత్తి జైకొట్టు తెలుగోడా
గతమెంతొ ఘనకీర్తి కలవోడా
నీ కీర్తి నిలుపుకో తెలుగోడా
తెలుగు వెలుగును నిలుపు తెలుగోడా

పాత తరానికి వారసులం కొత్త తరానికి వారధులం
తెలుగు సంస్కృతి రథసారథులం.


---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
12-11-2008
శ్రీకాకుళం

తెలుగు భాష

తెలుగు భాష
తే.గీ.
తెలుగు వెలుగుల జగమెల్ల నిలుపు భాష
పలుకు పలుకున తేనియ లొలుకు భాష
పలుకు బంగార మైనట్టి తెలుగుభాష
మధురమైనట్టి భాష నా మాతృభాష.

తే.గీ.
తెలుగు పలుకుల యందున తీపి మాట
తెలుగు సంగీత సుధ లందు తేటయూట
తెలుగు కావ్యము లందున తీర్పుబాట
వెలయు నవరస పరిపోష తెలుగుభాష.

తే.గీ.
అందమైనది నా భాష ఆంధ్రభాష
తీయనైనది నా భాష తెలుగుభాష
మధురమైనది నా తెల్గు మాతృభాష
దేశభాషల యందున తెలుగు లెస్స.

ఆ.వె.
తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
తెలుగువాడ; నాది తెలుగుభాష.
మధురమైన తెలుగు మన మాతృభాషయే
దేశ భాషలందు తెలుగు లెస్స.

--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)


27-11-2008
శ్రీకాకుళం

దీపావళి శుభాకాంక్షలు

క.
దీపావళి వెలిగిన ఈ
దీపాలే వే వెలుగుల తీయని కవితా
రూపాలై అభివృద్ధికి
సోపానములగుచు సర్వ శుభము లొసగుతన్.

వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

గరికిపాటి

మహా సహస్రావధాని,సాహిత్యవేత్త, పుంభావ సరస్వతి, అసాధారణ ధారణా నిపుణ,అవిరళ కవితా సాగర ఘోష యాత్రాతత్పర బ్రహ్మశ్రీ
గరికిపాటి నరసింహా రావు, ఎమ్.ఎ., పి.హెచ్.డి. మహోదయులకు
వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకర్త వేదుల బాలకృష్ణమూర్తి వ్రాయు ఆశీరభినందన.

తే.గీ.
వర సహస్రావధాని మా గరికిపాటి
వర మహా సహస్రఫణి మా గరికిపాటి
గగన వీధి విహారి మా గరికిపాటి
కల్పనానల్ప కవిత మా గరికిపాటి.

తే.గీ.
పరమ భావుకతా మూర్తి గరికిపాటి
సరస సాహితీమయ మూర్తి గరికిపాటి
వరద శేముషీ విభవమ్ము గరికిపాటి
సరస వాగ్వైభవాకృతి గరికిపాటి.

తే.గీ.
సరసకవి కోటిలో మేటి గరికిపాటి
గాంగ నిర్ఘర వాగ్ధాటి గరికిపాటి
గళవిపంచికా స్వరపేటి గరికిపాటి
సరస కవితల సురఝురి గరికిపాటి.

తే.గీ.
కడమలేని సాగర ఘోషగరికిపాటి
కడలి కెరటాల ధారణ గరికిపాటి
కళల పదకేళి రసకేళి గరికిపాటి
కవికులాబ్ధి సుధానిధి గరికిపాటి.

తే.గీ.
ఆయురారోగ్య భోగభాగ్యములనొసగి
సతము గరికిపాటిని బ్రోచు శారదాంబ;
కరము శుభకరమగు పద్య సరసిజముల
కృతిని యొసగె వేదుల బాలకృష్ణమూర్తి.


18-1-2007,
శ్రీకాకుళం (వ్రాయసకాడు) - నరసింహ

అక్కినేనికి అశీరభినందన

అక్కినేని నటించిన సినిమాల పేర్లతో రచించిన సీస మాలిక
సీ।
బాలరాజు మరియు బాలచంద్రుడు కాళి
దాసు మరియు దేవదాసు అగుచు
లైలామజును మేటి కీలుగుఱ్ఱము బాట
సారి మరియు పల్లెటూరి బావ
మాంగల్య బలము అమరశిల్పి జక్కన
విప్రనారాయణ వినుత కీర్తి
ముద్దుగారు దసరా బుల్లోడు పాటలు
సత్కీర్తి డాక్టరు చక్రవర్తి
జగజెట్టి మిస్సమ్మ జయభేరి మ్రోగించ
చాణక్య లక్ష్మమ్మ చక్రధారి
నవరాత్రులందు అనార్కలి నాట్యాలు
గుండమ్మ కథ సమకూర్చు యశము
పార్థుడుగా గయోపాఖ్యానమున నిల్చె
చిలిపి కృష్ణుడుగ నవ్వులను పంచె
అందాల రాముడుస్వప్నసుందరి
ఆత్మీయులైనట్టి ఆలుమగలు
మాయా బజారులో మంచిమనసులులో
ప్రేమాభిషిక్తులై ప్రేమనగరి
సంసారమున బడి సంతానమును గని
శాంతి నివాసాసెక్రటరి
దొరబాబు వలె నున్న దొంగరాముడు పూల
రంగడును తెనాలి రామకృష్ణ
రామ కృష్ణులు తుకారామును క్షేత్రయ్య
జయదేవుడును పునర్జన్మ నంది
తే।గీ.
మూగమనసులులో అనురాగ మధురి
మలను వెదజల్లిన నటసమ్రాటు అనెడు
పేరు నిలబెట్టుకున్న కబీరు అగుచు
అక్కినేని నాగేశ్వరుడలరుచుండ
ఆయురారోగ్య భోగభాగ్యముల నొసగి
కృష్ణ పరమాత్మకృపను రక్షించు గాక!
హృద్యమౌ మైత్రి పెంపొంద పద్య రత్న
మాలిక నొసంగె వేదుల బాలకృష్ణ!

చిత్ర కవిత
తుల చలచిత్ర కీర్తి సౌధాల నెక్కి
నేర్పుమై అన్యచింతల నెల్ల మాని
నాటకములె ప్రారంభపు నటన గా
ఈశ్వరుకృప వెండితెఱ నటించితౌ!
రాణ కెక్కి నాగేశ్వర రావు! నీవు!

ఆ।వె.
వేల్పు ఱేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి!

సి.నా.రె.

తే. గీ।
వాసిగాంచు విశ్వంభర వ్రాసినారె
విశ్వవిఖ్యాతి నార్జించి వెలసినారె
చావగల కావ్యరచనలు చేసినారె
మంచి మనసున్న మృదుభాషి మన సినారె

తే।గీ.
వెండి తెర పాటలకు బాట వేసినారె
రాసులుగ గేయరచనలు పోసినారె
సొంపుగ పగలే వెన్నల చూసినారె
మహిత కవితల రసఝరి మన సినారె
తే।గీ.
ప్రౌఢి తెల్గు గజల్సును వ్రాసినారె
ఘుమ ఘుమల గగన కుసుమాలు కోసినారె
మోయలేనన్ని బిరుదులు మోసినారె
మధుర భావ మనోల్లాసి మన సినారె

ప్రపంచ వయోవృద్ధుల దినము (అక్టోబరు ౧)

ప్రపంచ సంస్థ అయిన యునెస్కో వారు ప్రతి సంవత్సరము అక్టోబరు ఒకటవ తేదీని ప్రపంచ వయోవృద్ధుల రోజుగా పాటించవలెనని నిర్ణయించేరు।
గౌరవనీయులైన వయోవృద్ధులారా! మీరెల్లరూ ఏకమై శంఖారావం పూరించండి।

మీలో విద్య, విజ్ఞానము, వివేకము, వివిధ విషయ పరిజ్ఞానము, లోకానుభవము, ప్రేమ, కరుణ,వాత్సల్యము, సహనము, భూతదయ, మానవతా విలువలు వంటి సుగుణములు ఎన్నో వున్నాయని, అనుభవంతో కూడిన కార్యదక్షత, బుద్ధికుశలతతో కూడిన శక్తి సామర్ధ్యములు ఉన్నాయని ప్రపంచానికి చాటి చెప్పండి।

నేటి వయోవృద్ధులు నిన్నటి యువతరం వారె
ఈ నాటి యువతరం వారు రేపటి వయోవృద్ధులు

అన్న నిత్య సత్యాన్ని ప్రజలకు తెలియ జేయండి।

ఎన్నో కష్టనష్టముల కోర్చి, ప్రేమాభిమానములతో మీ బిడ్డలను పెంచి పెద్ద చేసినారు। దైవసమానులైన తల్లిదండ్రులను, కుటుంబంలోని ఇతర వయోవృద్ధులను అభిమానించి ఆదరించుట యువతరం వారి బాధ్యత।

మానవుడు సంఘజీవి। సమాజంలో పుట్టి, పెరిగి, సమాజంలో జీవిస్తున్న మానవుడు ఇతరుల సహాయ సహకారముల తోనే మనుగడ సాగిస్తూ, సమాజానికెంతో రుణపడి యున్నాడు। కావున మీ శక్తి ననుసరించి సమాజాభివృద్ధికి ధన వస్తు సేవల రూపంలో మీ సహాయ సహకారములు అందజేయవలసి యున్నది।

వయోవృద్ధ బాంధవులారా!

మీరు ప్రతి ఊరిలోను, వాడవాడల వయోవృద్దుల సంఘములను నెలకొల్పి, సద్గోష్టి, సంకీర్తనము, సత్కార్యాచరణము వంటి కార్యక్రమములు చేపట్టుట శ్రేయస్కరము।
ఈ సందర్భములో మహాకవి గురజాడ చెప్పిన సూక్తులు:

స్వంత లాభం కొంత మానుకు పొరుగు వారికి తోడుపడవోయ్
దేశమును ప్రేమించుమన్నా! మంచి యన్నది పెంచుమన్నా।
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్।

మననం చేసికొనుట యెంతయినా ఆవశ్యకము.

౧-౧౦-౨౦౦౮

-----వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

ఘంటసాల స్మృత్యంజలి

సీ॥
చలచిత్ర నేపథ్య సంగీత స్వరహేల
గంధర్వ మణిమాల ఘంటసాల
సంగీత సాహిత్య సరసార్ధ భావాల
గాత్ర మాధుర్యాల ఘంటసాల
పద్యాల గేయాల వచనాల శ్లోకాల
గమకాల గళలీల ఘంటసాల
బహువిధ భాషల పదివేల పాటల
గాన వార్నిధిలోల ఘంటసాల

తే॥ గీ॥
కమ్ర కమనీయ రాగాల ఘంటసాల
గళవిపంచికా శృతిలోల ఘంటసాల
గాంగనిర్ఘర స్వరలీల ఘంటసాల
గాయకుల పాఠశాల మా ఘంటసాల।
శ్రీకాకుళం
౦౭-౦౪-౨౦౦౮
--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

కరుణశ్రీ-దివ్యస్మృతి

సీ॥
పూలను కోయంగ పువ్వులు ఏడ్చుచు
మూగ భాషను తెల్పు పూల బాధ
కన్న సుతుని గంగ కర్పింప దిగివచ్చు
కన్యకామణి కుంతి కాళ్ళ జంకు
సంధ్య వెలుగున నారింజకు నీళ్ళిచ్చు
శసిరేఖ కట్టిన పసుపు చీర
భాగవతము వ్రాయు బమ్మెర గంటమున్
పంచదారను అద్దు భావ గరిమ
తే॥గీ॥
ఎటుల ఊహించి వ్రాసితొ!ఇట్టి సరస
భావ విలసితమగు తెల్గు పద్య కనిత!
తెలుగు వారికి తొలి జన్మ ఫలము గాగ
ప్రాప్తమైనట్టి సుకవి పాపయ్యశాస్త్రి!
తే॥ గీ॥
శ్రీ విలసితమగు కరుణశ్రీ యనంగ
పద్య కవితా యశశ్విపాపయ్యశాస్త్రి!
పద్య కవితా సుమాస్త్రి పాపయ్యశాస్త్రి!
పద్య సౌధాల మే స్త్రి పాపయ్యశాస్త్రి!

తే॥ గీ॥
పాండితీ ప్రాభవముల పాపయ్యశాస్త్రి!
పద్య కవితా పయోధి పాపయ్యశాస్త్రి!
పద్య కవితకు వెలుగు పాపయ్యశాస్త్రి!
పసిడి పలుకుల కవిత పాపయ్యశాస్త్రి!
తే॥ గీ॥
భావవీధీ విహారి
పాపయ్యశాస్త్రి!
భవ్య కవితా సురఝరి
పాపయ్యశాస్త్రి!
వాణి వీణా స్వరఝరి
పాపయ్యశాస్త్రి!
వాణి సౌందర్యలహరి
పాపయ్యశాస్త్రి!

రచన: వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

దసరా పద్యములు


శ్రీగణ నాయక శ్రిత పారిజాత
నాగేంద్ర వందిత నవమ నీహార
పార్వతీ సత్పుత్ర భవ్య చారిత్ర
గీర్వాణ వినుత సత్కీర్తి విస్తార
పావన నామ మాం పాహి విఘ్నేశ!
జయ జయా జయ జయా
జయ మహా విజయ!

ఏదయా మీదయ మామీద లేదు
ఇంత సేపుంచుట ఇది మీకు తగునా
దసరాకు వస్తిమని విసవిసలు పడక
చేతిలో లేదనక అప్పివ్వరనక
ఇరుగు పొరుగుల వారు ఇస్తారు సుమ్మి
పావలా బేడైతె పట్టేది లేదు
అర్ధరూపాయిస్తె అంటేది లేదు
ముచ్చెవక ఇస్తేను ముట్టేది లేదు
ఇచ్చు రూపాయిస్తె పుచ్చుకుంటాము
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు
జయ జయా జయ జయా
జయ మహా విజయ!

౩।
సీతమ్మ వాకిటా సిరి మల్లె చెట్టు
సిరిమల్లె చెట్టేమొ విరగ పూసింది
చెట్టు కదలాకుండ కొమ్మ వంచండి
కొమ్మ విరుగాకుండ పూలు కోయండి
అందులో పెదపూలు దండ గుచ్చండి
దండ తీసుకవెళ్ళి సీత కివ్వండి
సీతమ్మ రాముని మెడలోన వేసు!

సేకరణ: వేదుల బాలకృష్ణమూర్తి, నరసింహ

మణి ప్రవాళము

ఇతర భాషా పదములను చేర్చి ఛందోబద్ధమైన పద్య కవితను చెప్పిన అది "మణి ప్రవాళము" అనబడును।
ఉదా: జూదము-పానము
సీ:
మార్నింగు కాగానె మంచము లీవింగు
మొగము వాషింగు చక్కగ సిటింగు
కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు
గడగడ డ్రింకింగు గ్రంబులింగు
భార్యతో ఫైటింగు బయటికి మార్చింగు
క్లబ్బును రీచింగు గ్లాంబులింగు
విత్తము లూజింగు చిత్తము రేవింగు
వెంటనే డ్రింకింగు వేవరింగు
తే॥గీ॥
మరల మరల రిపీటింగు మట్టరింగు
బసకు ష్టార్టింగు జేబులు ప్లండరింగు
దారి పొడవున డాన్సింగు థండరింగు
సారె సారెకు రోలింగు స్లంబరింగు॥

ఇలాంటిదే మరో పద్యము
శా॥
పోస్టాఫీసున పోస్టు చేయుడొక జాబున్ నేడు నా మాటలన్
టెస్టున్ చేయగవచ్చు "స్టార్టిమిడియేట్లీ" యంచు వైరిచ్చుటే
బెస్టన్నింటను; వైరు చూచుకొనుచున్ వేవేగ మేల్ ట్రయినులో
నే స్టార్టౌనత డారణాలె కద మీ కేమైన వేస్టైనచో।

(రూపాయకి పదహారు అణాలు అయితే ఆరు అణాలకు ౩౮ పైసలు అవుతుంది)
సేకరణ :వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు- సరసింహ)

వ్యయ ఉగాది

భక్త రామదాసుకు యూ జగమంతా రామమయముగా కనిపించినట్లుగానే, నాకు యీ వ్యయనామ సంవత్సర నూతన ఉగాది, సకల ప్రపంచము అంతా సరస్వతీ మయంగా గోచరిస్తున్నది। అందువలన నేను యీ వ్యయ ఉగాదిని సరస్వతీ రూపంగా భావించి స్వాగత కళాంజలులను సమర్పిస్తున్నాను.
సీ:॥
రాజ బింబాననా రాజీవలోచనా
రాగదే వ్యయవత్సరంబ నీవు
సకల గుణోపేత సరసార్ధ పరిపూత
రాగదే వ్యయవత్సరంబ నీవు
సాహిత్య రసపోష సంగీత స్వరభూష
రాగదే వ్యయవత్సరంబ నీవు
లలిత కళావాణి జలజసంభవు రాణి
రాగదే వ్యయవత్సరంబ నీవు
తే॥గీ॥
రాగభావములకును స్వరావళికిని
శృతిలయలకు గాంధర్వ సంగతులు తెలుప
తెలుగు బిడ్డవై శారదాదేవిరూప
వ్యయ నవాబ్దమ రమ్ము శుభములొసగు॥
తే॥గీ॥
స్వాగతము నీకు నవ్య వసంతలక్ష్మి!
చిత్రరధు కూర్మి సహచరి చైత్రలక్ష్మి!
ఆయురారోగ్య సంపదల్ అందజేసి
తెలుగు లోగిళ్ళ నింపుము తెలుగు వెలుగు!
వ్యయ ఉగాది,
శ్రీకాకుళం,
౩౦-౩-౨౦౦౬
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

మేడసాని మోహన్

మహా పంచ సహస్రావధాని ,టి।టి।డి। అన్నమాచార్య ప్రోజెక్టు డైరెక్టరు శ్రీయుతులు మేడసాని మోహన్ గారికి
ఆశీరభినందనలు

తే॥గీ॥
మేటికవి "పంచసాహస్రి" మేడసాని
మింటి నిర్ఝర వాగ్ఘరి మేడసాని
మిన్ను ముట్టెడి ప్రతిభయే మేడసాని
మించు రసమయ కవితయె మేడసాని


తే॥గీ॥
మీ సములమంచు చెప్పగా మేడసాని
మీసములు ఉన్న కవులేరి మేడసాని
లేడు నీ సరి కవి నేడు మేడసాని
లేడు లేడు నీ సరిజోడు మేడసాని
తే॥గీ॥
మేరు శిఖరమ్ము కవితకు మేడసాని
మేటి ధారణా పటిమకు మేడసాని
ఏడుకొండల రాయడు మేడసాని
ఏడుగడ మీకు అవధాని! మేడసాని!!

వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

పద్య కవితా కుసుమాంజలి

దేవీ ఉపాసకులు,పరివ్రాజకులు, స్వామి శ్రీ శ్రీయానంద(పూర్వాశ్రమంలో బ్రహ్మశ్రీ ఈశ్వర సత్యనారాయణ శర్మ గారు) ౧౨౧ జయంతి తే।౨౯-౨-౨౦౦౮ దీని శ్రీకాకుళం శ్రీ రాజరాజేశ్వరీ పీఠం అధిపతులు శ్రీ విద్యానందనాధ శ్రీ సుసరాపు దుర్గాప్రసాద శర్మ గారు జరిపించిన సమయమున

పూర్వ విద్యార్ధి, వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకము రచయిత వేదుల బాలకృష్ణమూర్తి సమర్పించు

పద్య కవితా నీరాజనం
ఉ:
శ్రీయుత రాజయోగి, కవిశేఖరు, గాన కళాప్రపూర్ణులున్,
ధీయుత, వైద్యశాస్త్ర విదు, దేశిక వర్యు, శ్రీయాభి నాధులన్,
పాయని భక్తి గొల్తు, జనవంద్యుని ఈశ్వర వంశ్యు సత్యనా
రాయణ శర్మ మద్గురు మహత్వ కవిత్వ పటుత్వ సిద్ధికై।

క:
వెలనాటివాడ కవితకు
వెలనాటిన వాడ భావ వీధులయందున్
వెలసిన వెలగల కవితల
వెలయించిన వాడ నేను వేదుల కృష్ణన్.

శ్రీకాకుళం,
౨౯-౦౨-౨౦౦౮ సదా సంగీత సాహిత్యాల సేవలో-- వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

శివధనుర్భంగము

చ.
కదలకుమీ ధరాతలమ కాశ్యపిఁ బట్టు ఫణీంద్ర భూ విషా
స్పదులను బట్టు కూర్మమ రసాతలభోగిఢులీకులీశులన్
వదలక పట్టు ఘృష్టి ధరణీఫణికచ్ఛపపోత్రివర్గమున్
బొదువుచుఁ బట్టుఁడీ కరులు భూవరుడీశుని చాపమెక్కిడున్.
సీతా స్వయంవర ఘట్టంలో శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టటానికి ముందుగా లక్ష్మణుడు చేసిన హెచ్చరికను కవయిత్రి మొల్ల అద్భుతమైన పద్యంలో రచించినది.
లక్ష్మణుడు భూమిని భరించే అధినాయకుల ను ఒక్కొక్కరినీ పేరు పేరునా సంభోదిస్తూ- భూమి, ఆదిశేషువు, కూర్మము, వరాహము, అష్టదిగ్గజములనూ సావధానులై ఉండగలందులకు చేసిన హెచ్చరిక ఇది।
ఓ భూమీ! కదలకు! ఆదిశేషుడా! భూమిని గట్టిగా పట్టుకో।ఓ కూర్మమా! ఆదిశేషుడిని,భూమినీ వదలకుండా పట్టుకో। వరాహమా! కూర్మమును,ఆదిశేషుని,భూమినీ వదలకుండా గట్టిగా పట్టుకో।అష్టదిగ్గజములారా !మీరు ఆది వరాహమును, ఆది కూర్మమును, ఆదిశేషుని, భూమినీ కదలకుండా గట్టిగా పట్టుకొని ఉండండి।శ్రీరాముడు శివధనస్సుని ఎక్కుపెట్ట బోతున్నాడు। బహుపరాక్!
క।
ఉర్వీనందనకై రా
మోర్వీపతి యెత్తు నిప్పు డుగ్రుని చాపం
బుర్విం బట్టుడు దిగ్దం
త్యుర్వీధరకిటిఫణీంద్రు లూఁతఁగఁ గడిమిన్।

భూపుత్రిక సీత కొఱకు భూనాధుడైన శ్రీరాముడు ఇప్పుడు శివుని ధనువును ఎక్కుపెట్టుచున్నాడు।కావున అష్టదిగ్గజాలు,ఆదివరాహము,కూర్మము,ఆదిశేషువు భూమిని కదలకుండా గట్టిగా పట్టుకొనవలసినదని మరోసారి హెచ్చరిక చేస్తున్నట్లుగా మరొక చిన్న పద్యంలో మొల్ల చెప్పినది।

దుర్గా స్తుతి

సీ:
ఓంకార ఐంకార శ్రీంకార క్లీంకార
ప్రణవ రూపిణి మహేశ్వరివి నీవు!
సర్వ సర్వంసహా చక్రాసనారూఢ
నాదబిందువు జగన్మాత నీవు!
క్షీరాబ్ధి కన్యక శ్రితజన పోషణి
లలిత భాషిణి మహా లక్ష్మి నీవు!
సంగీత సాహిత్య సామ్రాజ్య సంచార
వైభవోన్నతి వెల్గు వాణి నీవు!
తే.గీ:
కృష్ణవేణీ తటిన్ ఇంద్రకీలరూప
కనకశైల విహారిణి కనకదుర్గ!
విజయవాటిక వెలసిన విజయదుర్గ!
కరుణ పాలింపు మూడు లోకాల నీవు!
కృపను బ్రోవు వేదుల బాలకృష్ణమూర్తిII

శా:
ఓంకార స్థిత చక్రరాజ నిలయా ఓంకార చిద్రూపిణీ!
ఐంకారార్చిత దివ్యగాన విభవా ఆనందవాగీశ్వరీ!
శ్రీంకారాంకిత వైభవోన్నత మహా శ్రీ లక్ష్మిలోకేశ్వరీ!
క్లీంకారోజ్వల కాంతి వెల్గెడు నినున్ కీర్తింతు దుర్గాంబికా!

లుకులాము

నా స్వగ్రామమైన లుకులాము అగ్రహారము(నరసన్నపేట మండలము, శ్రీకాకుళం జిల్లా) గుఱించి
సీ:
వంశధారా నదీ ప్రాక్తటస్థిత దివ్య
ధామ గ్రామము లుకులాము మాది
అరువది పైన బ్రాహ్మణ కుటుంబము లున్న
అతి పెద్ద అగ్రహారమ్ము మాది
సంస్కృతాంధ్రములు భాషలు,వైద్య,వేదము
లను నేర్పగల లుకులాము మాది
సాధువర్తన,సదాచార,సంస్కృతు
లను మరువని లుకులాము మాది
తే।గీ:
విమల బూర్లె, కన్నేపల్లి, వేదుల, గరి
మెళ్ళ, నౌడూరి, పేరేపు, మేటిగొర్తి
వంశజులు, ప్రాప్త యశులు, సంపన్నులు గల
బ్రాహ్మణుల గొప్ప అగ్రహారమ్ము మాది.

సర్వజిత్తు సంవత్సరాది

సీ:
ఉదయాద్రి శిఖరాన ఉదయభాస్కరు దివ్య
పాదపద్మములకు ప్రణతులొసగి
మలయాద్రి పైవీచు మలయ మారుతముతో
నీలి మేఘాలలో తేలియాడి
మధుమాస కుసుమాల మధుకరీ బృందాల
సరసన తేనియల్ సంగ్రహించి
గున్నమావిని కూయు కోవిల పాటకు
స్వరరాగ మధురిమల్ సంతరించి.
తే.గీ:
జైత్రయాత్రకు వెడలుచు చైత్రమాస
శుక్లపక్షము పాడ్యమి శుభదినమున
తెలుగు ముంగిళ్ళ తెలుగుల వెలుగునింప
వచ్చినది సర్వజిత్తు సంవత్సరాది.

చ:
వరము లొసంగు కోరికను వచ్చె ఉగాదిని సర్వజిత్తు; శ్రీ
కరముగ శాంతి, సౌఖ్యములు కల్గగచేయుచు సర్వజిత్తునన్
వరముల నిచ్చుగాక; నవవర్ష ఫలంబుల సర్వజిత్తు
త్సరమిది భాగ్యదాయకము; స్వాగతమీయరె సర్వజిత్తుకున్.

తే.గీ:
సర్వజిత్తుకు సర్వత్ర జయము!జయము!
తెలుగు ప్రజలకు సర్వదా కలుగు జయము!
స్వాగతము సర్వజిత్ నూత్న వత్సరంబ!
స్వాగతము కొమ్ము మాకు శుభములిమ్ము!

సర్వజిత్తు ఉగాది
౨౦-౩-౨౦౦౭

సద్గురు త్యాగరాజ స్తోత్ర పంచ పద్యరత్నములు

(తే.23-4-2007,వైశాఖ శుద్ధ షష్ఠి 240వ జయంతి సందర్భముగ)
1.మ:
తిరువైయూరున నీవుపుట్ట అదియే తీర్థ స్థలంబయ్యె, ఆ
పురవీధుల్ భవదీయ గానఝరులన్ మున్గంగ యేనాటిదౌ
పరిపాకంబొ? ప్రసిద్ధగాయకమణి వ్రాతంబు లేతేరగా
స్వరరాగాంచిత గాన మాధురులతో సంగీత సామ్రాజ్యమై
తిరునాళ్లౌనట త్యాగపంచమికి ఎంతే ప్రాభవం బొప్పగన్!

2.సీ:
నగుమోము గనలేని నాజాలి తెలిసి బ్రో
వగ రావె పరమాత్మ యనుచు వేడి,
ఏతావునర నీకు నెంచ నిల్కడయని
భూనభమ్ములు కలబోసి వెదకి,
మా సీత నుద్వాహమైన కారణముచే
మహరాజువైనట్లు మాటలాడి,
బాల కనక మయ చేలునిగని ఏల
నీ దయ రాదని నిలువరించి,
తే.గీ:
బంటురీతిని కొలువీయ వరము నడిగి
రాజువై రామభక్తి సామ్రాజ్యమెల్ల
ఏలినాడవు జగము జేజేలు పలుక
ధన్యమైనది నీ జన్మ త్యాగరాజ!

3.సీ:
నిధి చాల సుఖమొ సన్నిధిసేవ సుఖమౌనొ
అనుచు తర్కించు తత్త్వార్థ దృష్టి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడే మాకు
తండ్రియౌ ననెడు బాంధవ్య దృష్టి
ఎంతవారలు గాని కాంత దాసులె యన్న
లోకజ్ఞతను తెలుపు లోక దృష్టి
శాంతము లేకున్న సౌఖ్యము లేదను
సత్యవాక్యము తెల్పు జ్ఞాన దృష్టి
తే.గీ:
ఇట్టి దృష్టిలమర్మము లెల్ల తెలిసి
రామ సేవయే మదిలోని కామితముగ
ఉంఛవృత్తి చేపట్టిన యోగివర్య!
త్యాగధనుడవు కాకర్ల త్యాగరాజ!

4.ఉ:
శ్రీరఘురామ పాదసరసీరుహ సేవనభాగ్య వైభవో
ధార విశేష లబ్ధ భవతారక మంత్ర జపానుశీల హృ
త్సారస పీఠికా విమల ధామము వాసముగాగ నిల్పితే!
సారసనేత్రునిన్ కృతుల సంస్తుతి చేయుచు త్యాగరాజ్ఞ్మణీ!

5.తే.గీ:
ఎందరొ మహానుభావులు అందరికిని
వందనములంచు వినయభావంబు మెరయ
ఫ్రముఖ ఘనరాగ పంచరత్నములు వ్రాసి
సకల సంగీత జగతికి 'చక్రవర్తి'
అనెడు బిరుదును గాంచిన త్యాగరాజ!
అందుకొనుము శతాధిక వందనములు!

22-07-2007 -- వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

నా కవిత

తేట తెలుగు వెలుగు
తేనెలొలుకు పలుకు
స్వేచ్ఛా చందస్సు
భావాంబర వీధు
విశ్రుత విహారా
గంగా నిర్ఘర తరంగా
నందనోద్యాన మందాకినీ తీరా
నటరాజమూర్తి అందెల మువ్వల సవ్వడు
నగరాజపుత్రి నాట్యవిలాసా
శ్రీ వాణి వీణా నిక్వణము
నారదుని మహతి నిస్వనము
బాలగోపాలుని మురళీ నాదా
సరిగమపదని సప్తస్వరము
నానామృత రసధార
స్వరగాన సుధా లహరు
'రసమయ' ఆంధ్ర సంస్కృతి వైభవా
కవిబ్రహ్మ కలం తిక్కన
'కోడి' వారి కవితా సోయగా
అపూర్వ ఆహ్వాన గీతిక
అపురూప ఆత్మీయత అభిమానా
అందించిన మమతా సురాగా
అలరించిన స్నేహవాత్సల్యా
కవితా మైత్రీ బాంధవ్యా
మందార మకరంద మాధుర్యా
దుబాయ్ పారిజాత పుష్పా
సురభిళ సుగంధ పరిమళా
అందుకొన్న మా అందరి హృదయా
నిండిన ఆనందోత్సాహా
పండిన మధుర మనోజ్ఞ భావన
తెలియజేయుటకు కృతజ్ఞత
"ల" సువర్ణాక్షర అంత్య ప్రాస
శ్రీకాకుళ కళా ప్రాభావా
సర్వదా 'మీ' వేదుల బా

---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

తెలుగు పద్యం

తెలుగు పద్యం
ఉ.
పద్యము తెల్గువారలకు భాగ్యఫలంబుగ లభ్యమౌటచే
గద్యము కన్న నెక్కుడగు గౌరవమిచ్చుచు పండితోత్తముల్
సేద్యము సేయరే హృదయ సీమల యందున; హృద్యపద్య నై
వేద్యము నిత్తు గైకొనుడు-వేడుక మీరఁగ ఆంధ్ర సోదరుల్.

చ.
పలుకు వెలంది ఆంధ్రి పద భంగిమ లాస్య నిబద్ధ మౌట రా
చిలుకలు పల్కరించినటు చిప్పిలు తేనెలు పల్కు పల్కునన్
పలుకుల రాణి ఆంధ్రి యని పండితులెల్లరు ప్రస్తుతింపగా
పలికిన పల్కులన్నియును పద్యము లయ్యె తెలుంగు నాడునన్.

"ముత్యాలసరాలు"

భాషను ప్రేమించుమన్నా
ఆంధ్రభాషను పెంచుమన్నా


భాష అంటే మాట కాదోయ్
భాష అంటే భావమోయ్


భాష యందున భావమున్నది
భావమందున భాష ఉన్నది


భాష, భావములకు
అవినాభావ సంబంధం!


సొంత లాభం కొంత మానుకు
భాషకోసం పాటు పడవోయ్
భాష అంటే మాట కాదోయ్
భాష అంటే మనుషులోయ్


భాషాభిమానం నాకుకద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
నీ సేవతో భాషామతల్లికి
మేడ కట్టవోయ్


ఆంధ్రియే నిను కన్నతల్లి
ఆంధ్రయే నీ మాతృభాష
ఆంధ్రి పదముల అందమంతా
జగతికే ఎరుక


దేశభాషల తెలుగులెస్సట
అందమైనది ఆంధ్రభాషట
తేనె లొలికెడి తెలుగుభాషట
మధురమైనది మాతృభాషట


పలుకు పలుకున తెనెలొలికెడి
తెలుగుభాషకు వందనం!
జిలుగు వెలుగుల తెలుగుతల్లికి
వందనం! అభివందనం!!
శ్రీకాకుళం,
౧౧-౦౩-౨౦౦౬ --వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

సర్వధారి ఉగాది

క॥
స్వాగతం నవ ఉగాదికి
స్వాగతమిదే చైత్రశుక్ల పాడ్యమితిథికిన్
స్వాగతము తెలుగు ప్రజలకు
స్వాగతమిదే సర్వధారి వత్సరమునకున్!
సీ॥
ధన,ధాన్యములు సంపదాళినెల్లను కూర్చి
శాంతి,సౌఖ్యములిచ్చు సర్వధారి!
సర్వ విద్యలు కళల్ శాస్త్ర విజ్ఞానముల్
జనులకు అందించు సర్వధారి!
గాయక, కవి, కళాకార సంతతికెల్ల
సత్కీర్తి చేకూర్చు సర్వధారి!
ఆయురారోగ్య భాగ్యములు కల్గగజేసి
సౌభాగ్యమందించు సర్వధారి!
తే॥గీ॥
సర్వమానవ కోటికి సర్వధారి!
సంతత వరప్రదాయివై సర్వధారి!
సకల శుభములనొసగు సర్వధారి!
స్వాగతంబిదె గైకొమ్ము సర్వధారి!

చిత్ర కవిత్వం
ఆ॥వె॥
వేల్పురేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి

సదా సంగీత, సాహిత్యాల సేవలో...
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

శ్రీకాకుళం
౦౭-౦౪-౨౦౦౮

బాలగోపాలుని మురళి బాలమురళి

బాలమురళి
సీ:
అథరమ్ము మధురమౌ మధురాధిపతిమృదు
మధురాధరమ్ముల మధువులెల్ల
అనవరతమ్మును ఆస్వాదనము సేయ
తనువెల్ల మధురమై తనరు మురళి
తను కుడ్యజాల రంధ్రములను వెల్వడు
రాగ సుధారసార్ణవము నందు
చే జారిపడి ఆంధ్ర సీమలో మంగళం
పల్లి వారింటను బాలమురళి
కృష్ణుడై పుట్టి రోచిష్ణుడై శాస్త్రీయ
సంగీత విద్యా విశారదుడయి
తే గీ:
ఆరు భాషల వాగ్గేయ కారుడగుచు
నేటి సంగీత విధులలో మేటి నరసి
ఫ్రాన్సు దేశ మందించిన బహుమతిగొని
విశ్వ విఖ్యాతి నార్జించి వెలసినాడు
బాలగోపాలుని మురళి బాలమురళి।
తే గీ:
వీణ, వయొలిను,కంజిర,వివిధ గతుల
వాదనమును, మృదంగము వాద్యమందు
ప్రజ్ఞ, "వయొలిను సోలో" మనోజ్ఞరీతి
నిర్వహణ కృష్ణకే చెల్లు ఉర్విలోన।
సీ:
సంగీత సాహిత్య సామ్రాజ్య విభవమ్ము
ప్రణవ గాంధర్వమ్ము
బాలమురళి
గాత్ర మాధుర్యమ్ము గాన ప్రావీణ్యమ్ము
లీలా వినోదమ్ము
బాలమురళి
రాగ సుధారస యాగ భోగఫలమ్ము
ప్రస్తార గమకమ్ము
బాలమురళి
నాదాను సంధాన వేదమంత్రార్ధమ్ము
వాయులీన స్వనము
బాలమురళి
తే గీ:
భావ,రాగ స్వరావళి
బాలమురళి
భవ్య శ్రుతిలయల వరాళి
బాలమురళి
వాణి వీణామృద రవళి
బాలమురళి
బాలగోపాలుని మురళి బాలమురళి।

ఉ:
పాటయె జీవితమ్ముగ అపార కళామయు జీవితమ్మునే
పాటగ మార్చుకొన్న వర బాలకుడీ మురళీ స్వరాళి ఆ
పాటల రాగ మాధురులు 'బాల' గళమ్మున చిందులేయగా
మాటల భావ దీపికలు మంగళహారతు లెత్త కృష్ణకున్
తే గీ:
బాలగోపాలు మురళికి భవ్య యశము
ఆయురారోగ్య సౌఖ్య సంపదల నొసగి
శారదా మాత 'మురళి'ని సాకు గాక
మంగళంపల్లి మురళికి మంగళంబు।
ఇతిశ్రీ
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
***












తే.గీ.
స్వస్థి!సంగీత సాహిత్య సార్వభౌమ!
స్వస్థి!సరస సప్తస్వర చక్రవర్తి!
స్వస్థి!కచ్చపి స్వరఝురి బాలమురళి!
స్వస్థి!మహతి గాన రవళి బాలమురళి!!

ఆ.వె.
వేల్పురేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి

తే.గీ.

ఏడుగుర్రాల రథముపై ఎక్కితిరుగు
హర్షవల్లి పురాధీశు డమితప్రీతి
ఆయురారోగ్య భోగభాగ్యముల నొసగి
మురళి! గాన సమ్రాట్టును బ్రోచుగాక!

--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

13-12-2008
శ్రీకాకుళం

ఆంధ్ర భాష

౧.సీ:
అల నన్నయ కవీంద్రు డాంధ్ర భాష
రాణ్మహేంద్ర పురిని వ్రాయునాడు
నరహరికే గాని నరులకీయను కావ్య
మంచు పోతన నిర్ణయించునాడు
శ్రీనాథు కవితకు దీనారటంకాల
స్వర్ణాభిషేకంబు జరుగునాడు
అల్లసాని కృతికి ఆంధ్రభోజుడు కృష్ణ
రాయలు పల్లకిన్ మోయునాడు
ఆ.వె.
చెక్కు చెదరలేదు మొక్కవోలేదాంధ్ర
భాష ప్రాభవంబు; ప్రక్కదారి
పట్టి క్షీణదశకు వచ్చుచున్నది నేడు
దిద్దుకొనుము సుతుల తెలుగుతల్లి।

తే।గీ.
తెలుగు పలుకుల యందున్న తీపిమాట
తెలుగు సంగీత సుధలలో తేటయూట
తెలుగు పద్యాలలో నున్న తీర్పుబాట
నేర్చుననుమాట ఇతరుడు నీళ్ళమూట।




తెలుగు తల్లి

జిలుగు వెలుగుల తెలుగు తల్లికి వందనం, అభివందనం IIజిలుగుII


తెలుగు భాషకు ఊపిరిచ్చిన నన్నపార్యా వందనం
దేశభాషల తెలుగు లెస్సను కృష్ణరాయా వందనం. IIజిలుగుII
తీయగా భాగవతం వ్రాసిన పోతరాజుకు వందనం
అల్లికను జిగిబిగిని చూపిన అల్లసానికి వందనం IIజిలుగుII
తెలుగు పాటకు ఖ్యాతి తెచ్చిన త్యాగరాజుకు వందనం
పదములకు నర్తనము నేర్పిన క్షేత్రయ్యకు వందనం IIజిలుగుII
పలుకు పలుకున తేనె లొలికెడు తెల్గు భాషకు వందనం
నృత్య కళకీ వన్నె తెచ్చిన కూచిపూడికి వందనం IIజిలుగుII

ఆంధ్రుల చరితం -పాట

ఆంధ్రుల చరితం
ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రులార!మీరు వినరండోయ్!

టంగుటూరిలో తరగని ధైర్యం
బులుసు వారిలో వెలిగెడి దీక్ష
వెంకటగిరిలో వెలయు సాహసం
రంగనాయకుని రైత్యభిమానం
ఆంధ్రచరిత్రను చిరస్థాయిగా
ఆలపించునని తెలియండీ!

బమ్మెరపోతన భాగవతములో
కమ్మని తిక్కన భారతమ్ములో
మర్మమెఱింగిన వేమన గీతిలో
మాటలు కాదమ్మా!!!
బంగరు బాటలేను సుమ్మా!!! IIఆంధ్రులII

కమ్మనిపాటల త్యాగయ భక్తి
తేనెల మాటల క్షేత్రయ రక్తి
తెలుగువారి సంగీత గరిమకు
చెందుగు పెట్టునమ్మా!
రతనపు జిలుగు పెట్టునమ్మా!
(బులుసు సాంబమూర్తి,వెంకటగిరి వరాహగిరి,యన్.జి.రంగా గారలు)
--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

సప్తస్వర కవితా నీరాజనం

త్యాగరాజ స్వామి
ఉ:
తియ్యని తెల్గుభాష కడతేర కృతుల్ రచియించి తంబురా
కొయ్యకు జీవదానమిడి కోమల కంఠము మేళగించి రా
మయ్యను భక్తి రూపమున ఆడియు,పాడి తరించినట్టి త్యా
గయ్యను సంస్మరింతు మన గానకళన్ వికసింప చేయగాన్.

మ:
అల సంగీత కళా సుధామయ విశాలాంభోధిలో నుండి కొ
ల్లలుగా మంజుల నూత్న భంగిమల కాల్వల్ తీసి ఆనందకం
దళ సస్యముల పెంచి విశ్వవినుతోద్యత్కీర్తి ధాన్యమ్ము గా
చేలకున్ నింపిన త్యాగరాజతడు! కాదే తాత ఆంధ్రోర్వికిన్!

చ:
ఎదురుగ కూరుచున్నయటులే రఘురాముని పల్కరించి నీ
హృదయపు వీణ మీఁటి పలురీతుల నీ కృతులందు భావమిం
పొదవగ వ్యాజ సంస్తుతుల ముచ్చటఁ దీర భజించి, పాడి నీ
శ దమల భక్తి గంటివి యశస్సును ముక్తిని త్యాగరాణ్మణీ!

ఉ:
నాదము యోగమై వెలయ నాభి హృదంతర, కంఠ జిహ్వ సం
పాదితమైన మార్గమున బాహిరమౌ గద వాక్కు, అట్టిదౌ
నాదము గానయోగ్య మగునట్టుల రామ కృతుల్ రచించితే
నాద సుధారసం బిల ననారతమున్ ప్రవహింపఁ జేయగాన్.

ఆ.వె.
తంబురాకు జీవ దానమ్ము నొసగి నీ
గళ విపంచి తోడ మిళితపరచి
సరసగతుల పాడి సంగీతసుధలను
చిలికినావు! భక్తి నిలిపినావు!

సీ:
అలకలల్లలాడ విశ్వామిత్రముని రాఘ
వుని మోము గాంచి పొంగిన తెఱంగు
ప్రక్కల నిలబడి పడతియు తమ్ముడు
మనసున తలచి మై మరచునొప్పు
సరుచిర వాద్యాలు సురల సన్నుతులతో
ముని వెంట రాముడు చనెడి విధము
కంచిలో వరదుడు గరుడ వాహన మెక్కి
పురవీధు లందున తిరుగు సరళి

ఆ.వె.
ఎవరు చెప్పిరయ్య!ఎటుల దర్శించినా
విట్టి భావచిత్ర విలసనములు
తెలుగువారి కెల్ల తొలిజన్మ పుణ్యాన
ప్రాప్తమైన భాగ్యఫలమ నీవు!

తే.గీ.
సరస సంగీత సాహిత్య సార్వభౌమ!
పుడమి గాంధర్వ విద్య సముద్ధరింప
అవతరించిన శ్రీ సరస్వతివి నీవు!
అందుకొను త్యాగరాజ! మా వందనములు!

--వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - నరసింహ)

స్వ విషయం

పేరు :వేదుల బాలకృష్ణ మూర్తి
జననము :15ఫిబ్రవరి, 1918
స్వస్థలం :శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం,లుకులాం అగ్రహారం గ్రామం.
హైస్కూలు విద్య :మున్సిపల్ హైస్కూల్,శ్రీకాకుళం(1926-1934)
ఇంటర్మీడియట్ విద్య :ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1957)
బి.ఎ(స్పెషల్ తెలుగు:ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1960)
ఉద్యోగము :1942-1976
సౌత్ ఈస్టరన్ రైల్వేలో స్టేషను మాష్టరు,సెక్షను కంట్రోలరు,కమర్షియల్
ఇన్స్ ట్రక్టరు(ఒరిస్సా,మధ్యప్రదేశ్,బీహార్లలో)
పదవీ విరమణ :1976
అభిమాన విషయములు:ఆంధ్రభాషా సాహిత్యములు,ఛందోబద్ధమైన పద్య కవిత్వము,
కర్ణాటక సంగీతము, కవిసమ్మేళనములో పాల్గొనుట,అష్టావధాన,శతావధానములలో
పృచ్ఛకునిగా పాల్గొనుట,సమస్యా పూరణలలో పాల్గొనుట(రేడియో,టి.వి),
సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విషయములపై వ్యాసరచన,పద్యరచన.
గ్రంధ రచన :వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకము
భువన విజయమును పోలిన సంగీత భువనవిజయము ఇది.శాస్త్రీయ సంగీతమునకు
ఆద్యులైన పదిమంది వాగ్గేయకారులు ఒకే వేదికపై ఉండి వారు రచించిన సంగీత కృతులను ఆ పాత్రధారులే శాస్త్రీయ
పద్ధతిలో గానం చేయుట ఇందులోని ప్రత్యేకత. --వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు-నరసింహ)

వేదుల బాలకృష్ణ మూర్తి

ఈ కొత్త బ్లాగును శ్రీ వేదుల బాలకృష్ణ గారి తరఫున,వారి కోసం, వారి అనుమతితో ప్రారంభిస్తున్నాను.ఇలా ఇంకొకరి తరఫున బ్లాగు ప్రారంభించ వచ్చునో లేదో నాకు తెలియదు.ఆయన వయసులో చాలా పెద్దవారు.కంప్యూటరు మీద పని చేయటం ఇప్పటికింకా తెలియదు.--నరసింహ
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates