శివమానసపూజా రాగరత్న సీసమాలిక

23-2-2009 శివరాత్రి పర్వదిన సందర్భంగా

శ్రీ సరస్వత్యైనమః
సీII
నాటరాగము పాడి నటరాజ మూర్తిని
ఆవాహనము సేతు ఆదరమున
గౌళ రాగముతోడ గౌరీపతికి రత్న
సింహాసనము నిత్తు చెలువు మీర
ఆరభి పాడి కేదారేశు భజియించి
అర్ఘ్యము అర్పింతు అమితభక్తి
ఘన వరాళిని పాడి గంగోదకము తెచ్చి
పాద్య మర్పించెద పశుపతికిని
శ్రీ రాగమును పాడి శ్రీశైలవిభునకు
ఆచమనం బిత్తు అమలమతిని
పంతువరాళి ని పాడి పంచామృత
స్నానము గావింతు శంకరునకు
శంకరాభరణాన స్వరరాగయుత భక్తి
సాంబశివునకు వస్త్రంబు లిత్తు
హంసధ్వనిని పాడి హరునకు అర్పింతు
యజ్ఞోపవీతంబు అమలమతిని
సారంగ పాడుచు చంద్రకళాధరు
నకు నిత్తు దివ్య చందనము ప్రీతి
హిందోళ పాడుచు హిమగిరీశున కిత్తు
కుంకుమాక్షతలను కూర్మితోడ
కల్యాణి పాడుచు కైలాసపతికి స
మర్పింతు స్వర్ణ సుమాల మాల
కాంభోజి రాగాన శంభో యనుచు పాడి
అగరు ధూపము లిత్తు అంబపతికి
శివరంజని ని పాడి శివునకు అర్పింతు
దేదీప్య మానస దీప కళిక
ఆనందభైరవి ఆలపించి మహేశు
నర్చింతు నైవేద్య మారగింప
బిలహరి పాడుచు భీమేశ్వరస్వామి
కర్పింతు తాంబూల మలఘు మతిని
నీలాంబరిని పాడి నీరాజనం బిత్తు
నీలకంఠునకు వరాల నొసగ
మధ్యమావతి పాడి మంత్రపుష్పము నిత్తు
పార్వతీపతికి ఉపాయనము
ధన్యాసి పాడి ప్రదక్షిణ మొనరింతు
ఫాలనేత్రునకు ప్రపత్తి తోడ
సురటి రాగము పాడి సుందరేశ్వరునకు
సాష్టాంగముగ నమస్కార మిడుదు

తే.గీ.
షోడశోపచారముల విశుద్ధమతిని
వివిధ దైవోపచారముల్ విహితమైన
వివిధ రాజోపచారముల్ వేడ్కనెరపి
నృత్యగీత వాద్యంబుల నిత్యవిధుల
పురహరుని మానసంబున పూజచేసి
త్ర్యంబకుని సత్కృపా కటాక్షంబు వలన
అఖిల జనులకు శాంతి సౌఖ్యములు కలుగ
ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగ
రసమయంబుగ బుధజన రంజకముగ
రాగమాలికా సీసము రచన చేసి
శివుని పాదము మీదను శిరసు నుంచి
రాజమౌళికి కృతి సమర్పణ మొనర్చె
భవుని కృప కోరి వేదుల బాలకృష్ణ!

సదా సంగీత సాహిత్యాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి.
వ్రాయసకాడు..(నరసింహ)

సర్వధారి భీష్మ ఏకాదశి,
శ్రీకాకుళం,
౦౫-౦౨-౨౦౦౯.
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates