లుకులాము

నా స్వగ్రామమైన లుకులాము అగ్రహారము(నరసన్నపేట మండలము, శ్రీకాకుళం జిల్లా) గుఱించి
సీ:
వంశధారా నదీ ప్రాక్తటస్థిత దివ్య
ధామ గ్రామము లుకులాము మాది
అరువది పైన బ్రాహ్మణ కుటుంబము లున్న
అతి పెద్ద అగ్రహారమ్ము మాది
సంస్కృతాంధ్రములు భాషలు,వైద్య,వేదము
లను నేర్పగల లుకులాము మాది
సాధువర్తన,సదాచార,సంస్కృతు
లను మరువని లుకులాము మాది
తే।గీ:
విమల బూర్లె, కన్నేపల్లి, వేదుల, గరి
మెళ్ళ, నౌడూరి, పేరేపు, మేటిగొర్తి
వంశజులు, ప్రాప్త యశులు, సంపన్నులు గల
బ్రాహ్మణుల గొప్ప అగ్రహారమ్ము మాది.

సర్వజిత్తు సంవత్సరాది

సీ:
ఉదయాద్రి శిఖరాన ఉదయభాస్కరు దివ్య
పాదపద్మములకు ప్రణతులొసగి
మలయాద్రి పైవీచు మలయ మారుతముతో
నీలి మేఘాలలో తేలియాడి
మధుమాస కుసుమాల మధుకరీ బృందాల
సరసన తేనియల్ సంగ్రహించి
గున్నమావిని కూయు కోవిల పాటకు
స్వరరాగ మధురిమల్ సంతరించి.
తే.గీ:
జైత్రయాత్రకు వెడలుచు చైత్రమాస
శుక్లపక్షము పాడ్యమి శుభదినమున
తెలుగు ముంగిళ్ళ తెలుగుల వెలుగునింప
వచ్చినది సర్వజిత్తు సంవత్సరాది.

చ:
వరము లొసంగు కోరికను వచ్చె ఉగాదిని సర్వజిత్తు; శ్రీ
కరముగ శాంతి, సౌఖ్యములు కల్గగచేయుచు సర్వజిత్తునన్
వరముల నిచ్చుగాక; నవవర్ష ఫలంబుల సర్వజిత్తు
త్సరమిది భాగ్యదాయకము; స్వాగతమీయరె సర్వజిత్తుకున్.

తే.గీ:
సర్వజిత్తుకు సర్వత్ర జయము!జయము!
తెలుగు ప్రజలకు సర్వదా కలుగు జయము!
స్వాగతము సర్వజిత్ నూత్న వత్సరంబ!
స్వాగతము కొమ్ము మాకు శుభములిమ్ము!

సర్వజిత్తు ఉగాది
౨౦-౩-౨౦౦౭

సద్గురు త్యాగరాజ స్తోత్ర పంచ పద్యరత్నములు

(తే.23-4-2007,వైశాఖ శుద్ధ షష్ఠి 240వ జయంతి సందర్భముగ)
1.మ:
తిరువైయూరున నీవుపుట్ట అదియే తీర్థ స్థలంబయ్యె, ఆ
పురవీధుల్ భవదీయ గానఝరులన్ మున్గంగ యేనాటిదౌ
పరిపాకంబొ? ప్రసిద్ధగాయకమణి వ్రాతంబు లేతేరగా
స్వరరాగాంచిత గాన మాధురులతో సంగీత సామ్రాజ్యమై
తిరునాళ్లౌనట త్యాగపంచమికి ఎంతే ప్రాభవం బొప్పగన్!

2.సీ:
నగుమోము గనలేని నాజాలి తెలిసి బ్రో
వగ రావె పరమాత్మ యనుచు వేడి,
ఏతావునర నీకు నెంచ నిల్కడయని
భూనభమ్ములు కలబోసి వెదకి,
మా సీత నుద్వాహమైన కారణముచే
మహరాజువైనట్లు మాటలాడి,
బాల కనక మయ చేలునిగని ఏల
నీ దయ రాదని నిలువరించి,
తే.గీ:
బంటురీతిని కొలువీయ వరము నడిగి
రాజువై రామభక్తి సామ్రాజ్యమెల్ల
ఏలినాడవు జగము జేజేలు పలుక
ధన్యమైనది నీ జన్మ త్యాగరాజ!

3.సీ:
నిధి చాల సుఖమొ సన్నిధిసేవ సుఖమౌనొ
అనుచు తర్కించు తత్త్వార్థ దృష్టి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడే మాకు
తండ్రియౌ ననెడు బాంధవ్య దృష్టి
ఎంతవారలు గాని కాంత దాసులె యన్న
లోకజ్ఞతను తెలుపు లోక దృష్టి
శాంతము లేకున్న సౌఖ్యము లేదను
సత్యవాక్యము తెల్పు జ్ఞాన దృష్టి
తే.గీ:
ఇట్టి దృష్టిలమర్మము లెల్ల తెలిసి
రామ సేవయే మదిలోని కామితముగ
ఉంఛవృత్తి చేపట్టిన యోగివర్య!
త్యాగధనుడవు కాకర్ల త్యాగరాజ!

4.ఉ:
శ్రీరఘురామ పాదసరసీరుహ సేవనభాగ్య వైభవో
ధార విశేష లబ్ధ భవతారక మంత్ర జపానుశీల హృ
త్సారస పీఠికా విమల ధామము వాసముగాగ నిల్పితే!
సారసనేత్రునిన్ కృతుల సంస్తుతి చేయుచు త్యాగరాజ్ఞ్మణీ!

5.తే.గీ:
ఎందరొ మహానుభావులు అందరికిని
వందనములంచు వినయభావంబు మెరయ
ఫ్రముఖ ఘనరాగ పంచరత్నములు వ్రాసి
సకల సంగీత జగతికి 'చక్రవర్తి'
అనెడు బిరుదును గాంచిన త్యాగరాజ!
అందుకొనుము శతాధిక వందనములు!

22-07-2007 -- వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

నా కవిత

తేట తెలుగు వెలుగు
తేనెలొలుకు పలుకు
స్వేచ్ఛా చందస్సు
భావాంబర వీధు
విశ్రుత విహారా
గంగా నిర్ఘర తరంగా
నందనోద్యాన మందాకినీ తీరా
నటరాజమూర్తి అందెల మువ్వల సవ్వడు
నగరాజపుత్రి నాట్యవిలాసా
శ్రీ వాణి వీణా నిక్వణము
నారదుని మహతి నిస్వనము
బాలగోపాలుని మురళీ నాదా
సరిగమపదని సప్తస్వరము
నానామృత రసధార
స్వరగాన సుధా లహరు
'రసమయ' ఆంధ్ర సంస్కృతి వైభవా
కవిబ్రహ్మ కలం తిక్కన
'కోడి' వారి కవితా సోయగా
అపూర్వ ఆహ్వాన గీతిక
అపురూప ఆత్మీయత అభిమానా
అందించిన మమతా సురాగా
అలరించిన స్నేహవాత్సల్యా
కవితా మైత్రీ బాంధవ్యా
మందార మకరంద మాధుర్యా
దుబాయ్ పారిజాత పుష్పా
సురభిళ సుగంధ పరిమళా
అందుకొన్న మా అందరి హృదయా
నిండిన ఆనందోత్సాహా
పండిన మధుర మనోజ్ఞ భావన
తెలియజేయుటకు కృతజ్ఞత
"ల" సువర్ణాక్షర అంత్య ప్రాస
శ్రీకాకుళ కళా ప్రాభావా
సర్వదా 'మీ' వేదుల బా

---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

తెలుగు పద్యం

తెలుగు పద్యం
ఉ.
పద్యము తెల్గువారలకు భాగ్యఫలంబుగ లభ్యమౌటచే
గద్యము కన్న నెక్కుడగు గౌరవమిచ్చుచు పండితోత్తముల్
సేద్యము సేయరే హృదయ సీమల యందున; హృద్యపద్య నై
వేద్యము నిత్తు గైకొనుడు-వేడుక మీరఁగ ఆంధ్ర సోదరుల్.

చ.
పలుకు వెలంది ఆంధ్రి పద భంగిమ లాస్య నిబద్ధ మౌట రా
చిలుకలు పల్కరించినటు చిప్పిలు తేనెలు పల్కు పల్కునన్
పలుకుల రాణి ఆంధ్రి యని పండితులెల్లరు ప్రస్తుతింపగా
పలికిన పల్కులన్నియును పద్యము లయ్యె తెలుంగు నాడునన్.

"ముత్యాలసరాలు"

భాషను ప్రేమించుమన్నా
ఆంధ్రభాషను పెంచుమన్నా


భాష అంటే మాట కాదోయ్
భాష అంటే భావమోయ్


భాష యందున భావమున్నది
భావమందున భాష ఉన్నది


భాష, భావములకు
అవినాభావ సంబంధం!


సొంత లాభం కొంత మానుకు
భాషకోసం పాటు పడవోయ్
భాష అంటే మాట కాదోయ్
భాష అంటే మనుషులోయ్


భాషాభిమానం నాకుకద్దని
వట్టి గొప్పలు చెప్పబోకోయ్
నీ సేవతో భాషామతల్లికి
మేడ కట్టవోయ్


ఆంధ్రియే నిను కన్నతల్లి
ఆంధ్రయే నీ మాతృభాష
ఆంధ్రి పదముల అందమంతా
జగతికే ఎరుక


దేశభాషల తెలుగులెస్సట
అందమైనది ఆంధ్రభాషట
తేనె లొలికెడి తెలుగుభాషట
మధురమైనది మాతృభాషట


పలుకు పలుకున తెనెలొలికెడి
తెలుగుభాషకు వందనం!
జిలుగు వెలుగుల తెలుగుతల్లికి
వందనం! అభివందనం!!
శ్రీకాకుళం,
౧౧-౦౩-౨౦౦౬ --వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

సర్వధారి ఉగాది

క॥
స్వాగతం నవ ఉగాదికి
స్వాగతమిదే చైత్రశుక్ల పాడ్యమితిథికిన్
స్వాగతము తెలుగు ప్రజలకు
స్వాగతమిదే సర్వధారి వత్సరమునకున్!
సీ॥
ధన,ధాన్యములు సంపదాళినెల్లను కూర్చి
శాంతి,సౌఖ్యములిచ్చు సర్వధారి!
సర్వ విద్యలు కళల్ శాస్త్ర విజ్ఞానముల్
జనులకు అందించు సర్వధారి!
గాయక, కవి, కళాకార సంతతికెల్ల
సత్కీర్తి చేకూర్చు సర్వధారి!
ఆయురారోగ్య భాగ్యములు కల్గగజేసి
సౌభాగ్యమందించు సర్వధారి!
తే॥గీ॥
సర్వమానవ కోటికి సర్వధారి!
సంతత వరప్రదాయివై సర్వధారి!
సకల శుభములనొసగు సర్వధారి!
స్వాగతంబిదె గైకొమ్ము సర్వధారి!

చిత్ర కవిత్వం
ఆ॥వె॥
వేల్పురేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి

సదా సంగీత, సాహిత్యాల సేవలో...
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

శ్రీకాకుళం
౦౭-౦౪-౨౦౦౮

బాలగోపాలుని మురళి బాలమురళి

బాలమురళి
సీ:
అథరమ్ము మధురమౌ మధురాధిపతిమృదు
మధురాధరమ్ముల మధువులెల్ల
అనవరతమ్మును ఆస్వాదనము సేయ
తనువెల్ల మధురమై తనరు మురళి
తను కుడ్యజాల రంధ్రములను వెల్వడు
రాగ సుధారసార్ణవము నందు
చే జారిపడి ఆంధ్ర సీమలో మంగళం
పల్లి వారింటను బాలమురళి
కృష్ణుడై పుట్టి రోచిష్ణుడై శాస్త్రీయ
సంగీత విద్యా విశారదుడయి
తే గీ:
ఆరు భాషల వాగ్గేయ కారుడగుచు
నేటి సంగీత విధులలో మేటి నరసి
ఫ్రాన్సు దేశ మందించిన బహుమతిగొని
విశ్వ విఖ్యాతి నార్జించి వెలసినాడు
బాలగోపాలుని మురళి బాలమురళి।
తే గీ:
వీణ, వయొలిను,కంజిర,వివిధ గతుల
వాదనమును, మృదంగము వాద్యమందు
ప్రజ్ఞ, "వయొలిను సోలో" మనోజ్ఞరీతి
నిర్వహణ కృష్ణకే చెల్లు ఉర్విలోన।
సీ:
సంగీత సాహిత్య సామ్రాజ్య విభవమ్ము
ప్రణవ గాంధర్వమ్ము
బాలమురళి
గాత్ర మాధుర్యమ్ము గాన ప్రావీణ్యమ్ము
లీలా వినోదమ్ము
బాలమురళి
రాగ సుధారస యాగ భోగఫలమ్ము
ప్రస్తార గమకమ్ము
బాలమురళి
నాదాను సంధాన వేదమంత్రార్ధమ్ము
వాయులీన స్వనము
బాలమురళి
తే గీ:
భావ,రాగ స్వరావళి
బాలమురళి
భవ్య శ్రుతిలయల వరాళి
బాలమురళి
వాణి వీణామృద రవళి
బాలమురళి
బాలగోపాలుని మురళి బాలమురళి।

ఉ:
పాటయె జీవితమ్ముగ అపార కళామయు జీవితమ్మునే
పాటగ మార్చుకొన్న వర బాలకుడీ మురళీ స్వరాళి ఆ
పాటల రాగ మాధురులు 'బాల' గళమ్మున చిందులేయగా
మాటల భావ దీపికలు మంగళహారతు లెత్త కృష్ణకున్
తే గీ:
బాలగోపాలు మురళికి భవ్య యశము
ఆయురారోగ్య సౌఖ్య సంపదల నొసగి
శారదా మాత 'మురళి'ని సాకు గాక
మంగళంపల్లి మురళికి మంగళంబు।
ఇతిశ్రీ
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
***












తే.గీ.
స్వస్థి!సంగీత సాహిత్య సార్వభౌమ!
స్వస్థి!సరస సప్తస్వర చక్రవర్తి!
స్వస్థి!కచ్చపి స్వరఝురి బాలమురళి!
స్వస్థి!మహతి గాన రవళి బాలమురళి!!

ఆ.వె.
వేల్పురేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి

తే.గీ.

ఏడుగుర్రాల రథముపై ఎక్కితిరుగు
హర్షవల్లి పురాధీశు డమితప్రీతి
ఆయురారోగ్య భోగభాగ్యముల నొసగి
మురళి! గాన సమ్రాట్టును బ్రోచుగాక!

--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

13-12-2008
శ్రీకాకుళం

ఆంధ్ర భాష

౧.సీ:
అల నన్నయ కవీంద్రు డాంధ్ర భాష
రాణ్మహేంద్ర పురిని వ్రాయునాడు
నరహరికే గాని నరులకీయను కావ్య
మంచు పోతన నిర్ణయించునాడు
శ్రీనాథు కవితకు దీనారటంకాల
స్వర్ణాభిషేకంబు జరుగునాడు
అల్లసాని కృతికి ఆంధ్రభోజుడు కృష్ణ
రాయలు పల్లకిన్ మోయునాడు
ఆ.వె.
చెక్కు చెదరలేదు మొక్కవోలేదాంధ్ర
భాష ప్రాభవంబు; ప్రక్కదారి
పట్టి క్షీణదశకు వచ్చుచున్నది నేడు
దిద్దుకొనుము సుతుల తెలుగుతల్లి।

తే।గీ.
తెలుగు పలుకుల యందున్న తీపిమాట
తెలుగు సంగీత సుధలలో తేటయూట
తెలుగు పద్యాలలో నున్న తీర్పుబాట
నేర్చుననుమాట ఇతరుడు నీళ్ళమూట।




తెలుగు తల్లి

జిలుగు వెలుగుల తెలుగు తల్లికి వందనం, అభివందనం IIజిలుగుII


తెలుగు భాషకు ఊపిరిచ్చిన నన్నపార్యా వందనం
దేశభాషల తెలుగు లెస్సను కృష్ణరాయా వందనం. IIజిలుగుII
తీయగా భాగవతం వ్రాసిన పోతరాజుకు వందనం
అల్లికను జిగిబిగిని చూపిన అల్లసానికి వందనం IIజిలుగుII
తెలుగు పాటకు ఖ్యాతి తెచ్చిన త్యాగరాజుకు వందనం
పదములకు నర్తనము నేర్పిన క్షేత్రయ్యకు వందనం IIజిలుగుII
పలుకు పలుకున తేనె లొలికెడు తెల్గు భాషకు వందనం
నృత్య కళకీ వన్నె తెచ్చిన కూచిపూడికి వందనం IIజిలుగుII

ఆంధ్రుల చరితం -పాట

ఆంధ్రుల చరితం
ఆంధ్రుల చరితం అతిరస భరితం
ఆంధ్రులార!మీరు వినరండోయ్!

టంగుటూరిలో తరగని ధైర్యం
బులుసు వారిలో వెలిగెడి దీక్ష
వెంకటగిరిలో వెలయు సాహసం
రంగనాయకుని రైత్యభిమానం
ఆంధ్రచరిత్రను చిరస్థాయిగా
ఆలపించునని తెలియండీ!

బమ్మెరపోతన భాగవతములో
కమ్మని తిక్కన భారతమ్ములో
మర్మమెఱింగిన వేమన గీతిలో
మాటలు కాదమ్మా!!!
బంగరు బాటలేను సుమ్మా!!! IIఆంధ్రులII

కమ్మనిపాటల త్యాగయ భక్తి
తేనెల మాటల క్షేత్రయ రక్తి
తెలుగువారి సంగీత గరిమకు
చెందుగు పెట్టునమ్మా!
రతనపు జిలుగు పెట్టునమ్మా!
(బులుసు సాంబమూర్తి,వెంకటగిరి వరాహగిరి,యన్.జి.రంగా గారలు)
--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)

సప్తస్వర కవితా నీరాజనం

త్యాగరాజ స్వామి
ఉ:
తియ్యని తెల్గుభాష కడతేర కృతుల్ రచియించి తంబురా
కొయ్యకు జీవదానమిడి కోమల కంఠము మేళగించి రా
మయ్యను భక్తి రూపమున ఆడియు,పాడి తరించినట్టి త్యా
గయ్యను సంస్మరింతు మన గానకళన్ వికసింప చేయగాన్.

మ:
అల సంగీత కళా సుధామయ విశాలాంభోధిలో నుండి కొ
ల్లలుగా మంజుల నూత్న భంగిమల కాల్వల్ తీసి ఆనందకం
దళ సస్యముల పెంచి విశ్వవినుతోద్యత్కీర్తి ధాన్యమ్ము గా
చేలకున్ నింపిన త్యాగరాజతడు! కాదే తాత ఆంధ్రోర్వికిన్!

చ:
ఎదురుగ కూరుచున్నయటులే రఘురాముని పల్కరించి నీ
హృదయపు వీణ మీఁటి పలురీతుల నీ కృతులందు భావమిం
పొదవగ వ్యాజ సంస్తుతుల ముచ్చటఁ దీర భజించి, పాడి నీ
శ దమల భక్తి గంటివి యశస్సును ముక్తిని త్యాగరాణ్మణీ!

ఉ:
నాదము యోగమై వెలయ నాభి హృదంతర, కంఠ జిహ్వ సం
పాదితమైన మార్గమున బాహిరమౌ గద వాక్కు, అట్టిదౌ
నాదము గానయోగ్య మగునట్టుల రామ కృతుల్ రచించితే
నాద సుధారసం బిల ననారతమున్ ప్రవహింపఁ జేయగాన్.

ఆ.వె.
తంబురాకు జీవ దానమ్ము నొసగి నీ
గళ విపంచి తోడ మిళితపరచి
సరసగతుల పాడి సంగీతసుధలను
చిలికినావు! భక్తి నిలిపినావు!

సీ:
అలకలల్లలాడ విశ్వామిత్రముని రాఘ
వుని మోము గాంచి పొంగిన తెఱంగు
ప్రక్కల నిలబడి పడతియు తమ్ముడు
మనసున తలచి మై మరచునొప్పు
సరుచిర వాద్యాలు సురల సన్నుతులతో
ముని వెంట రాముడు చనెడి విధము
కంచిలో వరదుడు గరుడ వాహన మెక్కి
పురవీధు లందున తిరుగు సరళి

ఆ.వె.
ఎవరు చెప్పిరయ్య!ఎటుల దర్శించినా
విట్టి భావచిత్ర విలసనములు
తెలుగువారి కెల్ల తొలిజన్మ పుణ్యాన
ప్రాప్తమైన భాగ్యఫలమ నీవు!

తే.గీ.
సరస సంగీత సాహిత్య సార్వభౌమ!
పుడమి గాంధర్వ విద్య సముద్ధరింప
అవతరించిన శ్రీ సరస్వతివి నీవు!
అందుకొను త్యాగరాజ! మా వందనములు!

--వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - నరసింహ)

స్వ విషయం

పేరు :వేదుల బాలకృష్ణ మూర్తి
జననము :15ఫిబ్రవరి, 1918
స్వస్థలం :శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట మండలం,లుకులాం అగ్రహారం గ్రామం.
హైస్కూలు విద్య :మున్సిపల్ హైస్కూల్,శ్రీకాకుళం(1926-1934)
ఇంటర్మీడియట్ విద్య :ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1957)
బి.ఎ(స్పెషల్ తెలుగు:ప్రైవేటు విద్యార్థి;ఆంధ్రా యూనివర్సిటీ(1960)
ఉద్యోగము :1942-1976
సౌత్ ఈస్టరన్ రైల్వేలో స్టేషను మాష్టరు,సెక్షను కంట్రోలరు,కమర్షియల్
ఇన్స్ ట్రక్టరు(ఒరిస్సా,మధ్యప్రదేశ్,బీహార్లలో)
పదవీ విరమణ :1976
అభిమాన విషయములు:ఆంధ్రభాషా సాహిత్యములు,ఛందోబద్ధమైన పద్య కవిత్వము,
కర్ణాటక సంగీతము, కవిసమ్మేళనములో పాల్గొనుట,అష్టావధాన,శతావధానములలో
పృచ్ఛకునిగా పాల్గొనుట,సమస్యా పూరణలలో పాల్గొనుట(రేడియో,టి.వి),
సంగీత సాహిత్య ఆధ్యాత్మిక విషయములపై వ్యాసరచన,పద్యరచన.
గ్రంధ రచన :వాగ్గేయకార కళావైభవము సంగీత రూపకము
భువన విజయమును పోలిన సంగీత భువనవిజయము ఇది.శాస్త్రీయ సంగీతమునకు
ఆద్యులైన పదిమంది వాగ్గేయకారులు ఒకే వేదికపై ఉండి వారు రచించిన సంగీత కృతులను ఆ పాత్రధారులే శాస్త్రీయ
పద్ధతిలో గానం చేయుట ఇందులోని ప్రత్యేకత. --వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు-నరసింహ)

వేదుల బాలకృష్ణ మూర్తి

ఈ కొత్త బ్లాగును శ్రీ వేదుల బాలకృష్ణ గారి తరఫున,వారి కోసం, వారి అనుమతితో ప్రారంభిస్తున్నాను.ఇలా ఇంకొకరి తరఫున బ్లాగు ప్రారంభించ వచ్చునో లేదో నాకు తెలియదు.ఆయన వయసులో చాలా పెద్దవారు.కంప్యూటరు మీద పని చేయటం ఇప్పటికింకా తెలియదు.--నరసింహ
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates