బాలగోపాలుని మురళి బాలమురళి

బాలమురళి
సీ:
అథరమ్ము మధురమౌ మధురాధిపతిమృదు
మధురాధరమ్ముల మధువులెల్ల
అనవరతమ్మును ఆస్వాదనము సేయ
తనువెల్ల మధురమై తనరు మురళి
తను కుడ్యజాల రంధ్రములను వెల్వడు
రాగ సుధారసార్ణవము నందు
చే జారిపడి ఆంధ్ర సీమలో మంగళం
పల్లి వారింటను బాలమురళి
కృష్ణుడై పుట్టి రోచిష్ణుడై శాస్త్రీయ
సంగీత విద్యా విశారదుడయి
తే గీ:
ఆరు భాషల వాగ్గేయ కారుడగుచు
నేటి సంగీత విధులలో మేటి నరసి
ఫ్రాన్సు దేశ మందించిన బహుమతిగొని
విశ్వ విఖ్యాతి నార్జించి వెలసినాడు
బాలగోపాలుని మురళి బాలమురళి।
తే గీ:
వీణ, వయొలిను,కంజిర,వివిధ గతుల
వాదనమును, మృదంగము వాద్యమందు
ప్రజ్ఞ, "వయొలిను సోలో" మనోజ్ఞరీతి
నిర్వహణ కృష్ణకే చెల్లు ఉర్విలోన।
సీ:
సంగీత సాహిత్య సామ్రాజ్య విభవమ్ము
ప్రణవ గాంధర్వమ్ము
బాలమురళి
గాత్ర మాధుర్యమ్ము గాన ప్రావీణ్యమ్ము
లీలా వినోదమ్ము
బాలమురళి
రాగ సుధారస యాగ భోగఫలమ్ము
ప్రస్తార గమకమ్ము
బాలమురళి
నాదాను సంధాన వేదమంత్రార్ధమ్ము
వాయులీన స్వనము
బాలమురళి
తే గీ:
భావ,రాగ స్వరావళి
బాలమురళి
భవ్య శ్రుతిలయల వరాళి
బాలమురళి
వాణి వీణామృద రవళి
బాలమురళి
బాలగోపాలుని మురళి బాలమురళి।

ఉ:
పాటయె జీవితమ్ముగ అపార కళామయు జీవితమ్మునే
పాటగ మార్చుకొన్న వర బాలకుడీ మురళీ స్వరాళి ఆ
పాటల రాగ మాధురులు 'బాల' గళమ్మున చిందులేయగా
మాటల భావ దీపికలు మంగళహారతు లెత్త కృష్ణకున్
తే గీ:
బాలగోపాలు మురళికి భవ్య యశము
ఆయురారోగ్య సౌఖ్య సంపదల నొసగి
శారదా మాత 'మురళి'ని సాకు గాక
మంగళంపల్లి మురళికి మంగళంబు।
ఇతిశ్రీ
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
***












తే.గీ.
స్వస్థి!సంగీత సాహిత్య సార్వభౌమ!
స్వస్థి!సరస సప్తస్వర చక్రవర్తి!
స్వస్థి!కచ్చపి స్వరఝురి బాలమురళి!
స్వస్థి!మహతి గాన రవళి బాలమురళి!!

ఆ.వె.
వేల్పురేడొసంగు వివిధ అన్నాదుల
బాస వెలది ఒసగు పలు చదువు
కృత్తివాసు డెపుడు గెడపు సర్వతృష్ణ
మూషక హయ విభుడు మొత్తు నార్తి

తే.గీ.

ఏడుగుర్రాల రథముపై ఎక్కితిరుగు
హర్షవల్లి పురాధీశు డమితప్రీతి
ఆయురారోగ్య భోగభాగ్యముల నొసగి
మురళి! గాన సమ్రాట్టును బ్రోచుగాక!

--వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు--నరసింహ)

13-12-2008
శ్రీకాకుళం

4 కామెంట్‌లు:

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

వేదుల బాలకృష్ణమూర్తి గారికి నా సాష్టాంగ నమస్కారములు తెలియజేయండి.

Unknown చెప్పారు...

అలానే

Bolloju Baba చెప్పారు...

పద్యం భావాలకు సంకెళ్లు వేస్తుందని జయప్రభ గారు ఓ వ్యాసం వ్రాసారు. ఈ పద్యాలను ఆమె చూస్తే బాగుండును.

సరళమైన భాషలో ఒక గొప్ప కళాకారుడిని పద్యాల్లో మూర్తీభవింపచేసారు.

ఇవే భావాలను వచనంలో వ్రాయాలంటే కనీసం 100 పేజీలు అవసరమౌతాయి.

చాలా బాగున్నాయి.

కవికి మనసుంటే చాలు వయసుతో పనిలేదు అన్నటువంటి విషయం (ప్రొఫైల్ లో 90 సంవత్సరాలు అని ఉంది)మాబోటి తరానికి ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.

ఈ పద్యాలను చదవటం ద్వారా మీ పాద చరణాలను స్పృశించు కొన్నట్లు భావించుకొంటున్నాను.

భవదీయుడు
బొల్లోజు బాబా

Unknown చెప్పారు...

బాబా గారూ
మీ అభిప్రాయాలను బాలక్రిష్ణమూర్తి గారికి తెలియపరుస్తాను.నరసింహ

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates