పద్యం - హృద్యం

పద్యం - హృద్యం
చెప్పే విషయాన్ని అందంగా చెపితే అది కవిత్వం ఔతుంది.
ఆ కవితను ఛందస్సులో చెపితే అది పద్యం అవుతుంది.
ఆరు వేదాంగాలలో ఒకటి ఐన ఛందస్సు పవిత్రం.
పవిత్ర ఛందస్సు సూత్రాలతో రచింపబడు పద్యం పవిత్రం.
గణ యతి ప్రాసలతో పద్యానికి వస్తాయి శృతిలయలు.
అందుకే రాగయుక్తంగా పాడడానికి అనుకూలం పద్యం.
తెలుగు ఛందస్సులో వున్న పద్యసంపద శతసహస్రాధికం.
కవులు తమ హృదయసీమల్లో చేస్తారు పద్యాల సేద్యం.
కవులు భాషాపాండిత్యాలను ఇస్తారు పద్యానికి నైవేద్యం.
గద్యం కన్నా ఎక్కువ గౌరవాన్ని పొందుతోంది పద్యం.
తెలుగువారికి దేవుడిచ్చిన గొప్పవరం పద్యం. 
కవుల భావనా చమత్కృతితో పద్యం అవుతుంది హృద్యం.
రచన : వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - మల్లిన నరసింహారావు )
శ్రీకాకుళం,
తే 16-07-2009 ది.

లలిత కళలు - ఆవశ్యకత

లలిత కళలు - ఆవశ్యకత

సమాజములో మానవతా విలువలు , నైతిక విలువలు నిలవాలంటే మానవులకు దైవభక్తి , అధ్యాత్మిక చింతన , సంగీత సాహిత్యాది లలిత కళలు అత్యంతావశ్యకము.
ఇటీవల ఇతర వ్యాపకముల కారణముగా వీటిపై ప్రజల ఆదరణ కొంత తగ్గినది . ఈ పరిస్థితిని అధిగమించుటకు
(1) ఆధ్యాత్మిక ప్రసంగములు
(2) సాహిత్య ఉపన్యాసములు
(3) అష్టావధానములు
(4) శతావధానములు
(5) సహస్రావధానములు
(6) కవి సమ్మేళనములు
(7) శాస్త్రీయ సంగీత సభలు
(8) శాస్త్రీయ నాట్య ప్రదర్శనలు
(9) పౌరాణిక నాటక ప్రదర్శనలు
(10) పౌరాణిక ప్రసంగములు
(11) హరికథలు.
విరివిగా జరుపుటకు ఇప్పుడు చేపట్టవలసిన కార్యక్రమముల గుఱించి మీ సలహాలను సూచనలను అందజేయ ప్రార్థన.
సదా సంగీత, సాహిత్యాల సేవలో.....
భవదాగమానాభిలాషులు
వేదుల బాలకృష్ణమూర్తి
దూసి బెనర్జీ భాగవతార్
మల్లిన నరసింహారావు
పాతతరానికి వారసులు,
క్రొత్తతరానికి వారధులు.

శ్రీకాకుళం
తే. 23-05-2009 ది

జడ అల్లి జడకుచ్చు జయదేవు డమరింప

వాగ్గేయకారులు శారదామాత కు
  సమర్పించిన ఆభరణములు
సీసము.
జడ అల్లి జడకుచ్చు జయదేవు డమరింప
తీర్థ నారాయణ తిలక మిడియె
వజ్రంపు ముక్కెర వర పురందరు డీయ
రత్నహారములు క్షేత్రయ్యఁ యొసగె
పట్టు చీరను ముత్తుస్వామి అర్పింప జ
ల్తారు రైక నొసంగె అన్నమయ్య
రత్న కిరీటమ్ము రాందాసు ఒసగ ము
త్యాల హారము లిచ్చె శ్యామశాస్త్రి

తేటగీతి.
రత్న సింహాసనము త్యాగరాజు కూర్ప
స్వర్ణ కంకణముల నిచ్చె స్వాతి ప్రభువు
సర్వభూషణాలంకృత శారదాంబ
వసుధ సంగీత వాణియై వరలు గాక !

శ్రీకాకుళం
5-11-2009

దొంగ కాని వాడు దున్నపోతు

సమస్యా పూరణలు.
దొంగ కాని వాడు దున్నపోతు

ఆ.వె.|| నేర్పు విద్య యందు నిపుణతకై పని
దొంగ కాని వాడు దున్నపోతు
వలెను కష్టపడిన ఫలితము అనుభవించు
బాలకృష్ణ మాట పసిడి మూట
 
ఆ.వె.|| దున్నపోతు నేల దున్నగ కష్టించు
దొంగతనము చేయు దొంగ,  కాని
వాడు దున్నపోతువలెను శ్రమించడు
తెలుగు కవితలోని జిలుగులెవియె

సెల్లుఫోనువల్ల చేటువచ్చె

సిలికానాంధ్రవారి సుజనరంజనిలో ప్రచురించబడ్డ నా సమస్యాపూరణ పద్యాలు
ఆ।వె||
స్కూటరెక్కి పోవుచుండెడి సమయాన

సెల్లుమ్రోగె; ఒంటిచేతి తోడ

బండి నడుప ఎదుటిబండిని ముద్దాడె

సెల్లుఫోనువల్ల చేటువచ్చె

కం||
పూరము రససంభరితము

పారము లేనట్టిరుచిరభావార్ధవచో

సారము తేట తెలుగు నుడి

కారమెయనిపించు తీపికలకండవలెన్


పుల్లెల శ్యామసుందర్గారిచ్చిన న్యస్థాక్షరికి -- వేదుల బాలకృష్ణగారు పూరించిన పద్యం

1వ పాదములో 3 వ అక్షరము 'జ"

2వ పాదములో 5వ అక్ష్రము 'వా

3వ పాదములో 7వ అక్ష్రము 'హా

4వ పాదములో 9వ అక్ష్రము 'రూ

వచ్చునట్లుగా ఉత్పలమాలలో నెహ్రూ శాంతిప్రియత్వమును వర్ణిచాలి

పూరణ ఇలా సాగింది

ఉ||

మేటివహరుండు జగమెల్లను శాంతిగూర్పనెంచిదే

శాటనచే రిష్ఠులను సంఘటితంబొనరించి వర్గపో

రాటములేని స్నేయుత రాజరికాలవ్యవస్థనిల్పె ఈ

కూటమి నిత్యమై తనరుకోరిక తీరును శాంతిదూతకున్



విశ్వభాషలందు తెఁలుగు లెస్స

శ్రీ సరస్వత్త్యైనమః

విశ్వభాషలందు తెఁలుగు లెస్స
తే.గీ.
దేశభాషలయందున "తెలుఁగు లెస్స"
అని పలికె కృష్ణరాయలు అరసి చూడ
విశ్వమున నేడు ఉన్నట్టి వివిధ భాష
లందు, తీయని మనభాష ఆంధ్రభాష
పలుకు పలుకున, తేనియలొలుకు భాష
గద్య పద్యాత్మింబైన కావ్యభాష
సాటిలేనట్టి నేటి భాషా వధూటి
రాసి యందుననే గాక వాసియందు
కూడ ఉత్తమమైనట్టి గొప్పభాష
తెలుఁగు వెలుఁగులు దిశలెల్ల తేజరిల్ల
వివిధభాషల కవులు కోవిదులు మెచ్చ
"విశ్వభాషలన్ లెస్స "ని వినుతికెక్కె.


రచన
వేదుల బాలకృష్ణమూర్తి
(వ్రాయసకాడు నరసింహ)
శ్రీకాకుళం,
23.06.2009.

తెలుఁగు వెలుఁగు తీపి తెలుఁగు జిలుఁగు తీపి

శ్రీ సరస్వత్త్యైనమః

తీపి తెలుఁగు
ఆ.వె.
తెలుఁగుభాష తీపి తెలుఁగు సంస్కృతి తీపి
తెలుఁగు జాతి తీపి తెలుఁగు తీపి
తెలుఁగు చరిత తీపి తెలుఁగుభవిత తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తెలుఁగు వెలుఁగు తీపి తెలుఁగు జిలుఁగు తీపి
తెలుఁగు పలుకు తీపి తెలుఁగు తీపి
తెలుఁగు పదము తీపి తెలుఁగు వాద్యము తీపి
తేనెలొలుకు భాష తెలుఁగు భాష.
ఆ.వె.
తెలుఁగు నటన తీపి తెలుఁగు నాట్యము తీపి
కూచిపూడి అనిన గొప్ప తీపి
తెలుఁగు కళలు తీపి తెలుఁగు శిల్పము తీపి
తెలుఁగు భాష తీపి తెలుసుకొనుడు.
ఆ.వె.
తెలుఁగు కనిత తీపి తెలుఁగు కావ్యము తీపి
తెలుఁగు పద్యరచన తేనె తీపి
తెలుఁగు సంప్రదాయ తీరుతెన్నులు తీపి
తెలిసికొనఁగ రండు తెలుఁగు తీపి.
ఆ.వె.
తెలుఁగు భాషలోని వెలుఁగులు, విలువలు,
తీపి తెలుపునట్టి తెలుఁగువాఁడ
విశ్వకవిని నేను, వేఁదుల కవి నేను
మాతృభాషలోని మమత నేను.
ఆ.వె.
తెలుఁగ దేలయన్న దేశంబు తెలుఁగే ను,
తెలుఁగు వాఁడ నాది తెలుఁగు భాష
తెలుఁగు నేల తీపి తెలుఁగు సర్వము తీపి
బాలకృష్ణ తెలుఁగు చాల తీపి.
ఆ.వె.
ఆంధ్రులగుచు పుట్ట ఆంధ్రభాష పలుక
పూర్వజన్మ కృతము పుణ్యఫలము
ఆంధ్రమాత మనకు అందించు ఆశీస్సు
లందుకొనఁగ రండు ఆంధ్రులార !
ఆ.వె.
ఫలరసములకన్న పాయసములకన్న
పంచదారకన్న పాలకన్న
తెలుఁగు భాషలోని తీపియే కడుమిన్న
తెలుఁగు పలుకులందు వెలయు తీపి.
ఆ.వె.
సరస కవిత తీపి శబ్ధార్థములు తీపి
భావములును తీపి భాష తీపి
భావకవిత తీపి భావవార్నిధి తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
అక్షరములు రస మలంకారము తీపి
లక్ష్యమెన్న తీపి లక్షణమ్ము
శైలి తీపి, ప్రౌఢి, ఛందస్సులును తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
పద్య రచన తీపి పాండితియును తీపి
తెలుఁగు పద్య మన్న తెగని తీపి
తేట తెలుఁగు తీపి ఆటవెలఁది తీపి
బాలకృష్ణ కవిత చాల తీపి.
ఆ.వె.
అన్నమయ్య తీపి అతని భక్తియు తీపి
అన్నమయ్య కృతులు అమిత తీపి
తిరుపతియును తీపి తిరుమలేశుఁడు తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
రామదాసు తీపి రామనామము తీపి
భద్రగిరిని రామభద్రమూర్తి
పలుకరించు పలుకు బంగారమౌ తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
త్యాగరాజు తీపి త్యాగయ్య కృతి తీపి
గాన మెన్న ముజ్జగాల తీపి
సరిగమపదని అను సంగీతమును తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
వెలగల కవితలకు వెలనాటిన కవిని
నవరసములకు వెల నాటినాడ
విశ్వవీథులందు పేరుగాంచిన కవి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తేట తేట తెలుఁగు తీపి తీపి తెలుఁగు
తెలుఁగు లోని తీపి తెలుఁగు తీపి
తెలుఁగు తీపి అయిన తీపియే తెలుఁగౌను
మాతృభాష నెపుడు మరువ రాదు.
ఆ.వె.
తెలుఁగు లోని తీపి తీపిలోని తెలుఁగు
రూపుచూడ ఒకటి;రుచులు ఒకటి,
అమ్మ భాషకున్న బొమ్మయు బొరుసును
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తెలుఁగు తీపిదనము తెలుఁగు పల్కులోని
కమ్మదనము జగతి ఖ్యాతి గాంచె;
మాతృభాషనెపుడు మరచిపోకుము తండ్రి !
తెలుఁగు గొప్పదనము నిలుపరండు!
ఆ.వె.
తేట తెలుఁగులోని తీపినంతయు తెచ్చి
ఆటవెలదులుగను అందజేతు
అందుకొనుడి మీఁరు ఆంధ్రసోదరులార !
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
తేట తెలుఁగు తీపి ఆటవెలది తీపి
తేటిపాటలోని మాట తీపి
సాటిలేదు, యిలను మేటి మా తెలుఁగుకు
బాలకృష్ణ తెలుఁగు పలుకు తీపి.
శ్రీకాకుళం,
23-06-09

సదా సాహిత్యసంగీతాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి.(వ్రాయసకాడు -నరసింహ)

ఆట వెలది లోని అక్షర నాట్యాలు

ఆ.వె.
ఆట వెలది లోని అక్షర నాట్యాలు
ఆట వెలది కైన పాట నేర్పు
ఆటవెలది చూపు అందమౌ నడకలు
ఆట వెలదులకును ఆట నేర్పు.

ఆటవెలది తోడ అడుగు వేయు
ఆటవెలదులకును మాట నేర్పు
ఆటవెలది తోడ మాటలాడు
ఆటవెలది తోడ పాట పాడు.

విరోధి సంవత్సరాది

సీ.
విలసిల్లవలె నేడు విశ్వవిఖ్యాతమౌ
భారత సంస్కృతీ ప్రాభవమ్ము
వికసింపవలె నేడు విజ్ఞానశాస్త్ర సం
పద్విభూతి వెలార్చు వైభవమ్ము
విరజిల్లవలె నేడు విభుధవరేణ్యులౌ
కవుల కావ్యాలపై గౌరవమ్ము
వినిపింపవలె నేడు విమల గాంధర్వమౌ
శాస్త్రీయ సంగీత స్వరవరాళి
తే.గీ.
సర్వతోముఖ ప్రతిభయు శ్రద్ధ తోడి
బుద్ధి విరిసినయపు డభివృద్ధి కలుగ
ఆంధ్రదేశాన లలితకళానురక్తి
వరలుగాక విరోధి వత్సరమున.

రచయిత
(దూసి బెనర్జీ)
శ్రీకాకుళం
౨౭-౦౩-౨౦౦౯

విరోధి ఉగాది

శ్రీసరస్వత్యైనమః
"విరోధి"ఉగాది
క.
స్వాగతము నవ ఉగాదికి
స్వాగతమిదె చైత్రశుక్లపాడ్యమి తిథికిన్
స్వాగతము తెలుగు ప్రజలకు
స్వాగత మిదియే విరోధి వత్సరమునకున్.
సీ.
క్రొత్తమావి చిగురు కొరికిన కోయిలల్
పంచమ స్వరమున పాట పాడ
మకరందమును గ్రోలి మధుకరీ బృందముల్
అలరుచు వింత నాట్యములు సలుప
తరులతాదులయందు విరియపూసిన పూలు
మారుతముల పరిమళము నింప
నవ వసంతాగమనము నవ్య కాంతితో
తెలుగు ముంగిళ్ళకు వెలుగు కూర్ప
తే.గీ.
చెఱకు విలుకాడు కూర్మి నెచ్చలిని కూడి
చైత్రరథమెక్కి జగమెల్ల స్వారి చేయ
రుగ్మతలు, విఘ్నములకు విరోధి యనగ
వచ్చినది
విరోధి ఉగాది పర్వదినము
స్వాగతము పల్కగా రండు ఆంధ్రులారా!

తే.గీ.
సప్తగిరి వాసుడైన శేషాచలపతి
కామిత వరప్రదాత వేంకటరమణుడు
ఆయురారోగ్య భోగ భాగ్యముల నొసగి
సకల జనులను రక్షించి సాకు గాక!

సదా సంగీత సాహిత్యాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయస కాడు-నరసింహ)
శ్రీకాకుళం
విరోధి ఉగాది
౨౭-౦౩-౨౦౦౯

శివమానసపూజా రాగరత్న సీసమాలిక

23-2-2009 శివరాత్రి పర్వదిన సందర్భంగా

శ్రీ సరస్వత్యైనమః
సీII
నాటరాగము పాడి నటరాజ మూర్తిని
ఆవాహనము సేతు ఆదరమున
గౌళ రాగముతోడ గౌరీపతికి రత్న
సింహాసనము నిత్తు చెలువు మీర
ఆరభి పాడి కేదారేశు భజియించి
అర్ఘ్యము అర్పింతు అమితభక్తి
ఘన వరాళిని పాడి గంగోదకము తెచ్చి
పాద్య మర్పించెద పశుపతికిని
శ్రీ రాగమును పాడి శ్రీశైలవిభునకు
ఆచమనం బిత్తు అమలమతిని
పంతువరాళి ని పాడి పంచామృత
స్నానము గావింతు శంకరునకు
శంకరాభరణాన స్వరరాగయుత భక్తి
సాంబశివునకు వస్త్రంబు లిత్తు
హంసధ్వనిని పాడి హరునకు అర్పింతు
యజ్ఞోపవీతంబు అమలమతిని
సారంగ పాడుచు చంద్రకళాధరు
నకు నిత్తు దివ్య చందనము ప్రీతి
హిందోళ పాడుచు హిమగిరీశున కిత్తు
కుంకుమాక్షతలను కూర్మితోడ
కల్యాణి పాడుచు కైలాసపతికి స
మర్పింతు స్వర్ణ సుమాల మాల
కాంభోజి రాగాన శంభో యనుచు పాడి
అగరు ధూపము లిత్తు అంబపతికి
శివరంజని ని పాడి శివునకు అర్పింతు
దేదీప్య మానస దీప కళిక
ఆనందభైరవి ఆలపించి మహేశు
నర్చింతు నైవేద్య మారగింప
బిలహరి పాడుచు భీమేశ్వరస్వామి
కర్పింతు తాంబూల మలఘు మతిని
నీలాంబరిని పాడి నీరాజనం బిత్తు
నీలకంఠునకు వరాల నొసగ
మధ్యమావతి పాడి మంత్రపుష్పము నిత్తు
పార్వతీపతికి ఉపాయనము
ధన్యాసి పాడి ప్రదక్షిణ మొనరింతు
ఫాలనేత్రునకు ప్రపత్తి తోడ
సురటి రాగము పాడి సుందరేశ్వరునకు
సాష్టాంగముగ నమస్కార మిడుదు

తే.గీ.
షోడశోపచారముల విశుద్ధమతిని
వివిధ దైవోపచారముల్ విహితమైన
వివిధ రాజోపచారముల్ వేడ్కనెరపి
నృత్యగీత వాద్యంబుల నిత్యవిధుల
పురహరుని మానసంబున పూజచేసి
త్ర్యంబకుని సత్కృపా కటాక్షంబు వలన
అఖిల జనులకు శాంతి సౌఖ్యములు కలుగ
ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగ
రసమయంబుగ బుధజన రంజకముగ
రాగమాలికా సీసము రచన చేసి
శివుని పాదము మీదను శిరసు నుంచి
రాజమౌళికి కృతి సమర్పణ మొనర్చె
భవుని కృప కోరి వేదుల బాలకృష్ణ!

సదా సంగీత సాహిత్యాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి.
వ్రాయసకాడు..(నరసింహ)

సర్వధారి భీష్మ ఏకాదశి,
శ్రీకాకుళం,
౦౫-౦౨-౨౦౦౯.

సంక్రాంతి హేల

సంక్రాంతి హేల


సీ.
అత్తవారిడు కట్న మందవచ్చు నటంచు
క్రొత్త అల్లుడు చంక గ్రుద్దుకొనఁగ

పుట్టింటి వారిచ్చు పట్టుచీరలకునై
ఆడపడుచు లెల్ల రాసపడఁగ

ఉల్లమ్ము బెగ్గిల్ల అల్లు రాకఁ దలంచి
లోభి మామకు గుండె లొటుకుమనఁగ

అప్పడాల్, వడియాలు, పప్పులాదిగకూర్చు
పనులలో అత్తలు మునిగితేల

తే.గీ.
వచ్చె వచ్చెను సంక్రాంతి వచ్చెననుచు
సకలజనులకుఁ దెలిపెడి చందమునను
కూర్మి చలిగాలులను వెంట గొనుచు వచ్చె
మాసరాజంబయిన పుష్యమాసమిపుడు.



సంకలనం ---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
e mail:vedulabaalakrishnamurty@yahoo.com
మీ మీ అభిప్రాయాలు తెలియజేయగల వారి కందరికీ ముందుగా నా ధన్యవాదాలు.



శ్రీకాకుళం,
10-01-2009

భోగి పండుగ

అఖిలాంధ్ర సోదర సోదరీమణులందరికీ ముందుగా నా సంక్రాంతి శుభాకాంక్షలు.

భోగి పండుగ

సీ.
భోగి పండుగ వచ్చే పొందుగా మన ఇండ్ల
తలయంట్లు సాగించ వలయునేడు
ఎల్లి సంక్రాంతియు ఎల్లుండి కనుమావ
లెల్లుండి ముక్కనుమేగుదెంచు
దండిగా నిన్నాళ్ళు పిండి వంటలతోడ
ఇష్టమృష్టాన్నంబు లింపుమీర
బావలు,మరదులు,బందుగులల్లుండ్రు
వదినలు,మరదండ్రు పంక్తికుడువ
తే.గీ.
భోగిమంటలు,తోరణాల్,పొంగలియును,
బొమ్మలకొలువు,బాలల భోగిపళ్ళు,
గంగిరెద్దులు, హరిదాసు గానములును
తెలుగు ముంగిళ్ళ సరిక్రొత్త వెలుగునింప
కాంతులీనుచు మకర సంక్రాంతి వచ్చె.

సంకలనము
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
e mail:vedulabaalakrishnamurty@yahoo.com
మీ మీ అభిప్రాయాలు తెలియజేయగల వారి కందరికీ ముందుగా నా ధన్యవాదాలు.

శ్రీకాకుళం
08-01-2009

నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

బ్లాగ్మిత్రులందరికీ
నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు
---వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates