తెలుఁగు వెలుఁగు తీపి తెలుఁగు జిలుఁగు తీపి

శ్రీ సరస్వత్త్యైనమః

తీపి తెలుఁగు
ఆ.వె.
తెలుఁగుభాష తీపి తెలుఁగు సంస్కృతి తీపి
తెలుఁగు జాతి తీపి తెలుఁగు తీపి
తెలుఁగు చరిత తీపి తెలుఁగుభవిత తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తెలుఁగు వెలుఁగు తీపి తెలుఁగు జిలుఁగు తీపి
తెలుఁగు పలుకు తీపి తెలుఁగు తీపి
తెలుఁగు పదము తీపి తెలుఁగు వాద్యము తీపి
తేనెలొలుకు భాష తెలుఁగు భాష.
ఆ.వె.
తెలుఁగు నటన తీపి తెలుఁగు నాట్యము తీపి
కూచిపూడి అనిన గొప్ప తీపి
తెలుఁగు కళలు తీపి తెలుఁగు శిల్పము తీపి
తెలుఁగు భాష తీపి తెలుసుకొనుడు.
ఆ.వె.
తెలుఁగు కనిత తీపి తెలుఁగు కావ్యము తీపి
తెలుఁగు పద్యరచన తేనె తీపి
తెలుఁగు సంప్రదాయ తీరుతెన్నులు తీపి
తెలిసికొనఁగ రండు తెలుఁగు తీపి.
ఆ.వె.
తెలుఁగు భాషలోని వెలుఁగులు, విలువలు,
తీపి తెలుపునట్టి తెలుఁగువాఁడ
విశ్వకవిని నేను, వేఁదుల కవి నేను
మాతృభాషలోని మమత నేను.
ఆ.వె.
తెలుఁగ దేలయన్న దేశంబు తెలుఁగే ను,
తెలుఁగు వాఁడ నాది తెలుఁగు భాష
తెలుఁగు నేల తీపి తెలుఁగు సర్వము తీపి
బాలకృష్ణ తెలుఁగు చాల తీపి.
ఆ.వె.
ఆంధ్రులగుచు పుట్ట ఆంధ్రభాష పలుక
పూర్వజన్మ కృతము పుణ్యఫలము
ఆంధ్రమాత మనకు అందించు ఆశీస్సు
లందుకొనఁగ రండు ఆంధ్రులార !
ఆ.వె.
ఫలరసములకన్న పాయసములకన్న
పంచదారకన్న పాలకన్న
తెలుఁగు భాషలోని తీపియే కడుమిన్న
తెలుఁగు పలుకులందు వెలయు తీపి.
ఆ.వె.
సరస కవిత తీపి శబ్ధార్థములు తీపి
భావములును తీపి భాష తీపి
భావకవిత తీపి భావవార్నిధి తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
అక్షరములు రస మలంకారము తీపి
లక్ష్యమెన్న తీపి లక్షణమ్ము
శైలి తీపి, ప్రౌఢి, ఛందస్సులును తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
పద్య రచన తీపి పాండితియును తీపి
తెలుఁగు పద్య మన్న తెగని తీపి
తేట తెలుఁగు తీపి ఆటవెలఁది తీపి
బాలకృష్ణ కవిత చాల తీపి.
ఆ.వె.
అన్నమయ్య తీపి అతని భక్తియు తీపి
అన్నమయ్య కృతులు అమిత తీపి
తిరుపతియును తీపి తిరుమలేశుఁడు తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
రామదాసు తీపి రామనామము తీపి
భద్రగిరిని రామభద్రమూర్తి
పలుకరించు పలుకు బంగారమౌ తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
త్యాగరాజు తీపి త్యాగయ్య కృతి తీపి
గాన మెన్న ముజ్జగాల తీపి
సరిగమపదని అను సంగీతమును తీపి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
వెలగల కవితలకు వెలనాటిన కవిని
నవరసములకు వెల నాటినాడ
విశ్వవీథులందు పేరుగాంచిన కవి
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తేట తేట తెలుఁగు తీపి తీపి తెలుఁగు
తెలుఁగు లోని తీపి తెలుఁగు తీపి
తెలుఁగు తీపి అయిన తీపియే తెలుఁగౌను
మాతృభాష నెపుడు మరువ రాదు.
ఆ.వె.
తెలుఁగు లోని తీపి తీపిలోని తెలుఁగు
రూపుచూడ ఒకటి;రుచులు ఒకటి,
అమ్మ భాషకున్న బొమ్మయు బొరుసును
బాలకృష్ణ మాట పసిఁడి మూట.
ఆ.వె.
తెలుఁగు తీపిదనము తెలుఁగు పల్కులోని
కమ్మదనము జగతి ఖ్యాతి గాంచె;
మాతృభాషనెపుడు మరచిపోకుము తండ్రి !
తెలుఁగు గొప్పదనము నిలుపరండు!
ఆ.వె.
తేట తెలుఁగులోని తీపినంతయు తెచ్చి
ఆటవెలదులుగను అందజేతు
అందుకొనుడి మీఁరు ఆంధ్రసోదరులార !
బాలకృష్ణ మాట పసిఁడి మూట
ఆ.వె.
తేట తెలుఁగు తీపి ఆటవెలది తీపి
తేటిపాటలోని మాట తీపి
సాటిలేదు, యిలను మేటి మా తెలుఁగుకు
బాలకృష్ణ తెలుఁగు పలుకు తీపి.
శ్రీకాకుళం,
23-06-09

సదా సాహిత్యసంగీతాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి.(వ్రాయసకాడు -నరసింహ)

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇదంతా చదివేక తీపంటే బోరు కొట్టేసింది కానీ, కాస్త కారబ్బూంది తెచ్చిపెట్టండి మేష్టారూ :-) బై ద వే, అందుకేనా మన తెలుగువాళ్ళకి అందరికీ డయాబెటిస్సూ?

Unknown చెప్పారు...

డయాబెటిస్ ఉన్నవారైనా సరే ఏవిధమైన అభ్యంతరం లేకుండా ఈ మన తెలుగు తీపిని తనివి తీరా ఆస్వాదించవచ్చు. తెలుగులోనే మాట్లాడటం, తెలుగులోనే వ్రాయటం, తెలుగులోనే ఆలోచించటం, తెలుగును వ్యాప్తి చేయాలనుకోవటం, దానికోసం పరిశ్రమించయం ఇవన్నీ కూడా డయాబెటిస్ లాంటి తీవ్రమైన వ్యాధులను కొంతవరకూ అదుపులో ఉంచుకోవటానికి సహాయపడతాయనేది నా స్వానుభవంలో ఉన్న విషయం.

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates