సప్తస్వర కవితా నీరాజనం

త్యాగరాజ స్వామి
ఉ:
తియ్యని తెల్గుభాష కడతేర కృతుల్ రచియించి తంబురా
కొయ్యకు జీవదానమిడి కోమల కంఠము మేళగించి రా
మయ్యను భక్తి రూపమున ఆడియు,పాడి తరించినట్టి త్యా
గయ్యను సంస్మరింతు మన గానకళన్ వికసింప చేయగాన్.

మ:
అల సంగీత కళా సుధామయ విశాలాంభోధిలో నుండి కొ
ల్లలుగా మంజుల నూత్న భంగిమల కాల్వల్ తీసి ఆనందకం
దళ సస్యముల పెంచి విశ్వవినుతోద్యత్కీర్తి ధాన్యమ్ము గా
చేలకున్ నింపిన త్యాగరాజతడు! కాదే తాత ఆంధ్రోర్వికిన్!

చ:
ఎదురుగ కూరుచున్నయటులే రఘురాముని పల్కరించి నీ
హృదయపు వీణ మీఁటి పలురీతుల నీ కృతులందు భావమిం
పొదవగ వ్యాజ సంస్తుతుల ముచ్చటఁ దీర భజించి, పాడి నీ
శ దమల భక్తి గంటివి యశస్సును ముక్తిని త్యాగరాణ్మణీ!

ఉ:
నాదము యోగమై వెలయ నాభి హృదంతర, కంఠ జిహ్వ సం
పాదితమైన మార్గమున బాహిరమౌ గద వాక్కు, అట్టిదౌ
నాదము గానయోగ్య మగునట్టుల రామ కృతుల్ రచించితే
నాద సుధారసం బిల ననారతమున్ ప్రవహింపఁ జేయగాన్.

ఆ.వె.
తంబురాకు జీవ దానమ్ము నొసగి నీ
గళ విపంచి తోడ మిళితపరచి
సరసగతుల పాడి సంగీతసుధలను
చిలికినావు! భక్తి నిలిపినావు!

సీ:
అలకలల్లలాడ విశ్వామిత్రముని రాఘ
వుని మోము గాంచి పొంగిన తెఱంగు
ప్రక్కల నిలబడి పడతియు తమ్ముడు
మనసున తలచి మై మరచునొప్పు
సరుచిర వాద్యాలు సురల సన్నుతులతో
ముని వెంట రాముడు చనెడి విధము
కంచిలో వరదుడు గరుడ వాహన మెక్కి
పురవీధు లందున తిరుగు సరళి

ఆ.వె.
ఎవరు చెప్పిరయ్య!ఎటుల దర్శించినా
విట్టి భావచిత్ర విలసనములు
తెలుగువారి కెల్ల తొలిజన్మ పుణ్యాన
ప్రాప్తమైన భాగ్యఫలమ నీవు!

తే.గీ.
సరస సంగీత సాహిత్య సార్వభౌమ!
పుడమి గాంధర్వ విద్య సముద్ధరింప
అవతరించిన శ్రీ సరస్వతివి నీవు!
అందుకొను త్యాగరాజ! మా వందనములు!

--వేదుల బాలకృష్ణమూర్తి (వ్రాయసకాడు - నరసింహ)

5 కామెంట్‌లు:

రానారె చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రానారె చెప్పారు...

తియ్యని తెల్గుభాష కడతేర - అన్నారు. "కడతేరగా" అంటే నాకు తెలిసిన అర్థం "అంతమవగా" అని. నాకు తెలీని అర్థమేదో వుంది. దయచేసి చెప్పండి. కృతజ్ఞతలు.

Unknown చెప్పారు...

రానారె గారికి
కడ అనగా చివర అని అర్థము. కడతేర అనగా చివరి అంచు వరకూ(ఆసాంతము)-అంటే -ఏమీ మిగిలి పోకుండా పూర్తిగా అని అర్ధం.

రానారె చెప్పారు...

కృతజ్ఞతలు. పద్యాలు చాలా సరళంగా దాదాపుగా వచనంలా వుంటూనే త్యాగరాజును హృద్యంగా కీర్తిస్తూ మీ గొప్పదనాన్ని తెలియజేస్తున్నాయి.

Pranav Ainavolu చెప్పారు...

త్యాగరాజ స్వామి గురించి వెతుకుతూ మీ బ్లాగులోకొచ్చి పడ్డాను. సరళమైన తెలుగు పదాలతో చక్కగా రాశారు. చాలా బాగుంది :)

 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates