(తే.23-4-2007,వైశాఖ శుద్ధ షష్ఠి 240వ జయంతి సందర్భముగ)
1.మ:
తిరువైయూరున నీవుపుట్ట అదియే తీర్థ స్థలంబయ్యె, ఆ
పురవీధుల్ భవదీయ గానఝరులన్ మున్గంగ యేనాటిదౌ
పరిపాకంబొ? ప్రసిద్ధగాయకమణి వ్రాతంబు లేతేరగా
స్వరరాగాంచిత గాన మాధురులతో సంగీత సామ్రాజ్యమై
తిరునాళ్లౌనట త్యాగపంచమికి ఎంతే ప్రాభవం బొప్పగన్!
2.సీ:
నగుమోము గనలేని నాజాలి తెలిసి బ్రో
వగ రావె పరమాత్మ యనుచు వేడి,
ఏతావునర నీకు నెంచ నిల్కడయని
భూనభమ్ములు కలబోసి వెదకి,
మా సీత నుద్వాహమైన కారణముచే
మహరాజువైనట్లు మాటలాడి,
బాల కనక మయ చేలునిగని ఏల
నీ దయ రాదని నిలువరించి,
తే.గీ:
బంటురీతిని కొలువీయ వరము నడిగి
రాజువై రామభక్తి సామ్రాజ్యమెల్ల
ఏలినాడవు జగము జేజేలు పలుక
ధన్యమైనది నీ జన్మ త్యాగరాజ!
3.సీ:
నిధి చాల సుఖమొ సన్నిధిసేవ సుఖమౌనొ
అనుచు తర్కించు తత్త్వార్థ దృష్టి
సీతమ్మ మాయమ్మ శ్రీరాముడే మాకు
తండ్రియౌ ననెడు బాంధవ్య దృష్టి
ఎంతవారలు గాని కాంత దాసులె యన్న
లోకజ్ఞతను తెలుపు లోక దృష్టి
శాంతము లేకున్న సౌఖ్యము లేదను
సత్యవాక్యము తెల్పు జ్ఞాన దృష్టి
తే.గీ:
ఇట్టి దృష్టిలమర్మము లెల్ల తెలిసి
రామ సేవయే మదిలోని కామితముగ
ఉంఛవృత్తి చేపట్టిన యోగివర్య!
త్యాగధనుడవు కాకర్ల త్యాగరాజ!
4.ఉ:
శ్రీరఘురామ పాదసరసీరుహ సేవనభాగ్య వైభవో
ధార విశేష లబ్ధ భవతారక మంత్ర జపానుశీల హృ
త్సారస పీఠికా విమల ధామము వాసముగాగ నిల్పితే!
సారసనేత్రునిన్ కృతుల సంస్తుతి చేయుచు త్యాగరాజ్ఞ్మణీ!
5.తే.గీ:
ఎందరొ మహానుభావులు అందరికిని
వందనములంచు వినయభావంబు మెరయ
ఫ్రముఖ ఘనరాగ పంచరత్నములు వ్రాసి
సకల సంగీత జగతికి 'చక్రవర్తి'
అనెడు బిరుదును గాంచిన త్యాగరాజ!
అందుకొనుము శతాధిక వందనములు!
22-07-2007 -- వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయసకాడు-నరసింహ)
skip to main |
skip to sidebar
తెలుగు పద్యానికి నా నైవేద్యం
సద్గురు త్యాగరాజ స్తోత్ర పంచ పద్యరత్నములు
వీరిచే పోస్ట్ చేయబడింది
Unknown
on 26, సెప్టెంబర్ 2008, శుక్రవారం
లేబుళ్లు:
త్యాగయ్య
లంకె బిందెలు
మిత్రులు
నా గురించి
Labels
- ఆంధ్రభాష (5)
- ఆంధ్రభాష. పద్యం (1)
- ఆటవెలది (1)
- ఉగాదులు (5)
- ఎందరో మహానుభావులు - అందరికీ వందనములు (1)
- కవయిత్రి మొల్ల (1)
- గురుపూజ (1)
- త్యాగయ్య (2)
- దసరా పద్యములు (1)
- దీపావళి (1)
- పండుగలు (2)
- పద్యములు (4)
- పరిచయం (5)
- పాటలు (3)
- ప్రపంచ వయోవృద్ధులు (1)
- ప్రముఖులతో నా పరిచయాలు (5)
- లలిత కళలు (1)
- శారదా మాత (1)
- శివమానసపూజా రాగరత్న సీసమాలిక (1)
- సమస్యా పూరణలు (4)
- స్మృత్యంజలి (2)
1 కామెంట్‌లు:
మీవేనా? చాలా సంతోషం.
ఇటీవల కొన్నాళ్ళుగా అన్నమయ్య కీర్తనల్ని బ్లాగులో రాస్తున్న నరసింహ గారు మీరు కాదేమో!
ఒక్క సారి శ్రమ చేసుకుని నాకో మెయిలు పంపండి.
kottapali at gmail dot com
కామెంట్‌ను పోస్ట్ చేయండి