విరోధి సంవత్సరాది

సీ.
విలసిల్లవలె నేడు విశ్వవిఖ్యాతమౌ
భారత సంస్కృతీ ప్రాభవమ్ము
వికసింపవలె నేడు విజ్ఞానశాస్త్ర సం
పద్విభూతి వెలార్చు వైభవమ్ము
విరజిల్లవలె నేడు విభుధవరేణ్యులౌ
కవుల కావ్యాలపై గౌరవమ్ము
వినిపింపవలె నేడు విమల గాంధర్వమౌ
శాస్త్రీయ సంగీత స్వరవరాళి
తే.గీ.
సర్వతోముఖ ప్రతిభయు శ్రద్ధ తోడి
బుద్ధి విరిసినయపు డభివృద్ధి కలుగ
ఆంధ్రదేశాన లలితకళానురక్తి
వరలుగాక విరోధి వత్సరమున.

రచయిత
(దూసి బెనర్జీ)
శ్రీకాకుళం
౨౭-౦౩-౨౦౦౯

విరోధి ఉగాది

శ్రీసరస్వత్యైనమః
"విరోధి"ఉగాది
క.
స్వాగతము నవ ఉగాదికి
స్వాగతమిదె చైత్రశుక్లపాడ్యమి తిథికిన్
స్వాగతము తెలుగు ప్రజలకు
స్వాగత మిదియే విరోధి వత్సరమునకున్.
సీ.
క్రొత్తమావి చిగురు కొరికిన కోయిలల్
పంచమ స్వరమున పాట పాడ
మకరందమును గ్రోలి మధుకరీ బృందముల్
అలరుచు వింత నాట్యములు సలుప
తరులతాదులయందు విరియపూసిన పూలు
మారుతముల పరిమళము నింప
నవ వసంతాగమనము నవ్య కాంతితో
తెలుగు ముంగిళ్ళకు వెలుగు కూర్ప
తే.గీ.
చెఱకు విలుకాడు కూర్మి నెచ్చలిని కూడి
చైత్రరథమెక్కి జగమెల్ల స్వారి చేయ
రుగ్మతలు, విఘ్నములకు విరోధి యనగ
వచ్చినది
విరోధి ఉగాది పర్వదినము
స్వాగతము పల్కగా రండు ఆంధ్రులారా!

తే.గీ.
సప్తగిరి వాసుడైన శేషాచలపతి
కామిత వరప్రదాత వేంకటరమణుడు
ఆయురారోగ్య భోగ భాగ్యముల నొసగి
సకల జనులను రక్షించి సాకు గాక!

సదా సంగీత సాహిత్యాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి(వ్రాయస కాడు-నరసింహ)
శ్రీకాకుళం
విరోధి ఉగాది
౨౭-౦౩-౨౦౦౯

శివమానసపూజా రాగరత్న సీసమాలిక

23-2-2009 శివరాత్రి పర్వదిన సందర్భంగా

శ్రీ సరస్వత్యైనమః
సీII
నాటరాగము పాడి నటరాజ మూర్తిని
ఆవాహనము సేతు ఆదరమున
గౌళ రాగముతోడ గౌరీపతికి రత్న
సింహాసనము నిత్తు చెలువు మీర
ఆరభి పాడి కేదారేశు భజియించి
అర్ఘ్యము అర్పింతు అమితభక్తి
ఘన వరాళిని పాడి గంగోదకము తెచ్చి
పాద్య మర్పించెద పశుపతికిని
శ్రీ రాగమును పాడి శ్రీశైలవిభునకు
ఆచమనం బిత్తు అమలమతిని
పంతువరాళి ని పాడి పంచామృత
స్నానము గావింతు శంకరునకు
శంకరాభరణాన స్వరరాగయుత భక్తి
సాంబశివునకు వస్త్రంబు లిత్తు
హంసధ్వనిని పాడి హరునకు అర్పింతు
యజ్ఞోపవీతంబు అమలమతిని
సారంగ పాడుచు చంద్రకళాధరు
నకు నిత్తు దివ్య చందనము ప్రీతి
హిందోళ పాడుచు హిమగిరీశున కిత్తు
కుంకుమాక్షతలను కూర్మితోడ
కల్యాణి పాడుచు కైలాసపతికి స
మర్పింతు స్వర్ణ సుమాల మాల
కాంభోజి రాగాన శంభో యనుచు పాడి
అగరు ధూపము లిత్తు అంబపతికి
శివరంజని ని పాడి శివునకు అర్పింతు
దేదీప్య మానస దీప కళిక
ఆనందభైరవి ఆలపించి మహేశు
నర్చింతు నైవేద్య మారగింప
బిలహరి పాడుచు భీమేశ్వరస్వామి
కర్పింతు తాంబూల మలఘు మతిని
నీలాంబరిని పాడి నీరాజనం బిత్తు
నీలకంఠునకు వరాల నొసగ
మధ్యమావతి పాడి మంత్రపుష్పము నిత్తు
పార్వతీపతికి ఉపాయనముగ
ధన్యాసి పాడి ప్రదక్షిణ మొనరింతు
ఫాలనేత్రునకు ప్రపత్తి తోడ
సురటి రాగము పాడి సుందరేశ్వరునకు
సాష్టాంగముగ నమస్కార మిడుదు

తే.గీ.
షోడశోపచారముల విశుద్ధమతిని
వివిధ దైవోపచారముల్ విహితమైన
వివిధ రాజోపచారముల్ వేడ్కనెరపి
నృత్యగీత వాద్యంబుల నిత్యవిధుల
పురహరుని మానసంబున పూజచేసి
త్ర్యంబకుని సత్కృపా కటాక్షంబు వలన
అఖిల జనులకు శాంతి సౌఖ్యములు కలుగ
ఆయురారోగ్య భోగభాగ్యములు కలుగ
రసమయంబుగ బుధజన రంజకముగ
రాగమాలికా సీసము రచన చేసి
శివుని పాదము మీదను శిరసు నుంచి
రాజమౌళికి కృతి సమర్పణ మొనర్చె
భవుని కృప కోరి వేదుల బాలకృష్ణ!

సదా సంగీత సాహిత్యాల సేవలో
వేదుల బాలకృష్ణమూర్తి.
వ్రాయసకాడు..(నరసింహ)

సర్వధారి భీష్మ ఏకాదశి,
శ్రీకాకుళం,
౦౫-౦౨-౨౦౦౯.
 

Design in CSS by TemplateWorld and sponsored by SmashingMagazine
Blogger Template created by Deluxe Templates